క్యూ4లో రూ. 21,384 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది.
స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి.
పూర్తి ఏడాదికి సైతం..
ఇక పూర్తి ఏడాదికి ఎస్‌బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది.
మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment