న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 6,693 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 4,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,700 కోట్ల నుంచి రూ. 32,707 కోట్లకు ఎగసింది.
అయితే మొత్తం వ్యయాలు రూ. 21,516 కోట్ల నుంచి రూ. 25,161 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 203.4 మిలియన్ టన్నుల నుంచి 209 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు 165 ఎంటీ నుంచి 180 ఎంటీకి ఎగశాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఉత్పత్తి 596.22 ఎంటీ నుంచి 622.63 ఎంటీకి పురోగమించింది.
ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు 1% క్షీణించి రూ. 181 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment