Consolidated results
-
సైయంట్ లాభం రూ.173 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సైయంట్ లాభం 11.5 శాతం పెరిగి రూ.173 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.239 కోట్లు, ఎబిటా మార్జిన్ 16 శాతం నమోదైంది. ఆర్డర్ల రాక 21.9 శాతం పెరిగింది. టర్నోవర్ 8 శాతం ఎగసి రూ.1,491 కోట్లకు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే సైయంట్ షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.39 శాతం క్షీణించి రూ.2,018.95 వద్ద స్థిరపడింది. -
అదానీ పవర్ లాభం హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 83 శాతం జంప్‌చేసి రూ. 8,759 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 4,780 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 15,509 కోట్ల నుంచి రూ. 18,109 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మాత్రం రూ. 9,643 కోట్ల నుంచి రూ. 9,309 కోట్లకు తగ్గాయి. నిర్వహణ లాభం 41 శాతంపైగా మెరుగై రూ. 10,618 కోట్లకు చేరింది. స్థాపిత సామర్థ్యం 15,250 మెగావాట్లకు చేరగా.. 17.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. 60.1 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించింది. జార్ఖండ్‌లోని 1,600 మెగావాట్ల గొడ్డా అ్రల్టాసూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు అమ్మకాలు పెరిగేందుకు దోహదపడినట్లు కంపెనీ వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు విద్యుత్ ఎగుమతిని ప్రారంభించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పవర్ షేరు బీఎస్ఈలో 2.7 శాతం ఎగసి రూ. 275 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం హైస్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ తయారీకి టాటా సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు. 6 శాతం అప్ క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13% బలపడి రూ. 2,601 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అమ్మకాల పరిమాణం, మార్జిన్లు మెరుగుపడటం లాభాల వృద్ధికి దోహదపడింది. నికర అమ్మకాలు 11 శాతం పుంజుకుని రూ. 14,926 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 13,468 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సర్వీసులతో కలిపి మొత్తం రూ. 15,375 కోట్ల నిర్వహణ ఆదాయం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 10,782 కోట్ల నుంచి రూ. 11,961 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. విభాగాలవారీగా: క్యూ4లో హెచ్‌యూఎల్ హోమ్ కేర్ విభాగం ఆదాయం 19% వృద్ధితో రూ. 5,637 కోట్లను తాకింది. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఆదాయం 11% పుంజుకుని రూ. 5,257 కోట్లకు చేరింది. ఇక ఫుడ్స్, రిఫ్రెష్మెంట్ నుంచి 3 శాతం అధికంగా రూ. 3,794 కోట్లు నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌యూఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 14% ఎగసి రూ.10,143 కోట్లను తాకింది. 2021–22లో రూ. 8,892 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 15%పైగా జంప్‌చేసి రూ.59,443 కోట్లయ్యింది. అంతక్రితం రూ.51,472 కోట్ల టర్నోవర్ సాధించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 1.7 శాతం క్షీణించి రూ. 2,469 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 8,792 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 8,312 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం సైతం 35 శాతం జంప్‌చేసి రూ. 16,465 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.7 శాతం బలపడి 4.65 శాతానికి చేరాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి 3.07 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.26 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా లాభం రూ. 331 కోట్ల నుంచి రూ. 221 కోట్లకు క్షీణించింది. సాధారణ బీమా లాభం 11 శాతం మెరుగై రూ. 353 కోట్లను తాకింది. అసెట్ మేనేజ్మెంట్ లాభం రూ. 334 కోట్ల నుంచి రూ. 420 కోట్లకు వృద్ధి చూపింది. బ్రోకింగ్ విభాగం లాభం రూ. 281 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు ఇలా... క్యూ3లో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల స్లిప్పేజీలు రూ. 5,723 కోట్లను తాకాయి. వీటిలో రిటైల్, రూరల్ బ్యాంకింగ్ విభాగం నుంచి రూ. 4,159 కోట్లు, కార్పొరేట్ల నుంచి రూ. 1,500 కోట్లు చొప్పున నమోదయ్యాయి. ఇక రూ. 2,257 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. వీటిలో ప్రుడెన్షియల్ కేటాయింపులకింద రూ. 1,500 కోట్లు పక్కనపెట్టింది. దీంతో మొత్తం బఫర్ రూ. 11,500 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 300తో కలిపి మొత్తం బ్రాంచీల సంఖ్య 5,700కు చేరింది. -
కోల్ ఇండియా లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 6,693 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 4,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,700 కోట్ల నుంచి రూ. 32,707 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 21,516 కోట్ల నుంచి రూ. 25,161 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 203.4 మిలియన్ టన్నుల నుంచి 209 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు 165 ఎంటీ నుంచి 180 ఎంటీకి ఎగశాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఉత్పత్తి 596.22 ఎంటీ నుంచి 622.63 ఎంటీకి పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు 1% క్షీణించి రూ. 181 వద్ద ముగిసింది. -
ఐటీసీ డివిడెండ్ రూ. 6.25
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 12% వృద్ధితో రూ. 4,260 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3,817 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15% పైగా బలపడి రూ. 17,754 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15% పెరిగి రూ. 12,632 కోట్లను దాటాయి. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. జులై 22–26 మధ్య డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. కంపెనీ ఫిబ్రవరిలోనూ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడం తెలిసిందే. విభాగాల వారీగా: ఐటీసీ క్యూ4 ఆదాయంలో సిగరెట్ల విభాగం నుంచి 10 శాతం అధికంగా రూ. 7,177 కోట్లు లభించగా.. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 4,149 కోట్లు సమకూరింది. ఇది 12 శాతం వృద్ధి. ఇక వ్యవసాయ సంబంధ బిజినెస్ మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 4,375 కోట్లను తాకింది. ఈ బాటలో హోటళ్ల ఆదాయం రూ. 105 కోట్లు జమ చేసుకుని రూ. 407 కోట్లను అధిగమించింది. పేపర్ బోర్డ్ అమ్మకాలు రూ. 1,656 కోట్ల నుంచి రూ. 2,183 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఐటీసీ నికర లాభం 16 శాతం పురోగమించి రూ. 15,243 కోట్లయ్యింది. 2020–21లో రూ. 13,161 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 65,205 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు ఎన్ఎస్ఈలో 0.75 శాతం బలపడి రూ. 267 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 23% అప్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 10,055 కోట్లను అధిగమించింది. ఇందుకు అన్ని విభాగాల్లోనూ రుణాలకు డిమాండ్ బలపడటం, మొండిరుణాలకు కేటాయింపులు తగ్గడం సహకరించింది. మొత్తం ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 41,086 కోట్లకు చేరింది. రుణాలు 20.8 శాతం పెరిగి రూ. 13,68,821 కోట్లను తాకాయి. రుణాలలో రిటైల్ 15.2 శాతం, గ్రామీణ బ్యాంకింగ్ విభాగం 30.4 శాతం, హోల్‌సేల్ విభాగం 17.4 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. నికర వడ్డీ ఆదాయం 10.2 శాతం బలపడి రూ. 18,873 కోట్లకు చేరింది. బ్రాంచీలు ప్లస్... క్యూ4లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 563 బ్రాంచీలు తెరవగా 7,167 మంది ఉద్యోగులను జత చేసుకుంది. పూర్తి ఏడాదిలో 734 బ్రాంచీలు ఏర్పాటు చేయగా.. అదనంగా 21,486 మంది ఉద్యోగులు చేరారు. కాగా.. సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్పీఏలు 0.4 శాతం నుంచి 0.32 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4,694 కోట్ల నుంచి రూ. 3,312 కోట్లకు దిగివచ్చాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో బ్యాంక్ నికర లాభం 23.8 శాతం ఎగసి రూ. 10,443 కోట్లయ్యింది. పూర్తి ఏడాదికి 19.5 శాతం వృద్ధితో రూ. 38,053 కోట్లను తాకింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి (సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. 2021–22లో స్టాండెలోన్ నికర లాభం 19 శాతం అధికమై రూ. 36,961 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం రూ. 1,57,263 కోట్లకు చేరింది. ఇది 7.7 శాతం వృద్ధి. ఈ నెల 23న సమావేశంకానున్న బోర్డు డివిడెండును ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బాండ్ల ద్వారా రూ.50,000 కోట్ల సమీకరణ! బాండ్ల జారీ ద్వారా రూ. 50,000 కోట్ల వరకూ సమీకరించాలని బోర్డు నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. నిధులను ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరల గృహాలకు రుణాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. రానున్న 12 నెలల్లోగా బాండ్ల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది(2022) సెప్టెంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చే విధంగా రేణు కర్నాడ్‌ను తిరిగి నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానున్న నేపథ్యంలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలియజేసింది. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 1,044 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం వృద్ధితో రూ. 3,168 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 3,016 కోట్ల టర్నోవర్ నమోదైంది. వడ్డీ ఆదాయం 5 శాతం బలపడి రూ. 3,087 కోట్లకు చేరింది. నిర్వహణలోని స్థూల గోల్డ్ లోన్ ఆస్తులు రూ. 54,688 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఫలితాలలో ముత్తూట్ హోమ్‌ఫిన్(ఇండియా), బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్, ముత్తూట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ తదితర అనుబంధల సంస్థల పనితీరు కలసి ఉన్నట్లు పేర్కొంది. -
నాల్కో హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 831 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,415 కోట్ల నుంచి రూ. 3,845 కోట్లకు జంప్ చేసింది. తాజాగా వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇప్పటికే రూ. 2.50 డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ లాభం అప్
ముంబై: ప్రైవేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 5,837 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 39,268 కోట్ల నుంచి రూ. 31,308 కోట్లకు క్షీణించింది. ఇక స్టాండెలోన్ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 3,261 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,926 కోట్లు ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం రూ. 4,005 కోట్ల నుంచి రూ. 4,284 కోట్లకు బలపడింది. ఏయూఎం ప్లస్: గృహ రుణాల్లో విలువరీత్యా 13 శాతం వరకూ ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయం గలవారికి మంజూరు చేసినట్లు హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి ఎం. మిస్త్రీ పేర్కొన్నారు. ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం రూ. 11.1–19.5 లక్షలుగా వెల్లడించారు. గృహ రుణ కస్టమర్లలో 2.7 లక్షల మంది రుణ ఆధారిత సబ్సిడీలను అందుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ పథకంకింద రూ. 45,914 కోట్ల రుణాలు విడుదల చేయగా.. సబ్సిడీ మొత్తం రూ. 6,264 కోట్లని తెలియజేశారు. క్యూ3లో నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,52,167 కోట్ల నుంచి రూ. 6,18,917 కోట్లకు బలపడినట్లు హెచ్డీఎఫ్సీ తెలియజేసింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 79 శాతంకాగా.. అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు రూ. 7,468 కోట్ల రుణాలను అసైన్ చేసినట్లు వెల్లడించింది. అందుబాటు ధరల గృహాలతోపాటు.. అధిక విలువలుగల ప్రాపర్టీల రుణాలకు సైతం భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు మిస్త్రీ పేర్కొన్నారు. కంపెనీ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.4 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతం లాభపడి రూ. 2,617 వద్ద ముగిసింది. -
అల్ట్రాటెక్ లాభం 8 శాతం అప్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం ఎగసి రూ. 1,710 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,585 కోట్లు ఆర్జించింది. ఆదాయం 6% ఎగసి రూ. 12,985 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 12,262 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో వ్యయాలు 12% పెరిగి రూ. 11,422 కోట్లను తాకాయి. బిర్లా వైట్..: బిర్లా వైట్ బ్రాండు వైట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ఆధునీకరణకు రూ. 965 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుత 6.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని దశలవారీగా 12.53 ఎల్టీపీఏకు చేర్చేందుకు తాజా సమావేశంలో బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. 1.2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుకోవడంతో భారీ మౌలిక ప్రాజెక్టుల ద్వారా బల్క్ సిమెంట్ అమ్మకాలను మరింత పెంచుకోగలమని కంపెనీ అభిప్రాయపడింది. ఇక యూపీలో బారా గ్రైండింగ్ లైన్–2 యూనిట్ ప్రారంభంతో సిమెంట్ ఉత్పాదక సామ ర్థ్యం 114.55 ఎంటీపీఏను తాకినట్లు తెలిపింది. రుణ చెల్లింపులు..: 2021 అక్టోబర్‌లో అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ ఎన్సీఆర్లో నిర్మాణాలపై నిషేధం, వర్షాలు, దీపావళి సెలవులు తదితర అంశాలు తదుపరి డిమాండును దెబ్బతీసినట్లు అల్ట్రాటెక్ వివరించింది. వెరసి క్యూ3లో కన్సాలిడేటెడ్ అమ్మకాలు 3 శాతం నీరసించి 23.13 మిలియన్ మెట్రిక్ టన్నులకు పరిమితమయ్యాయి. క్యూ3లో అంతర్గత వనరుల ద్వారా రూ. 3,459 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు బీఎస్ఈలో దాదాపు 3 శాతం ఎగసి రూ. 7,868 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భేష్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 9,096 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,703 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,438 కోట్ల నుంచి రూ. 41,436 కోట్లకు పుంజుకుంది. రుణాల విడుదల(అడ్వాన్స్‌లు) 14.7 శాతం పెరిగి రూ. 12,49,331 కోట్లకు చేరింది. స్టాండెలోన్ పద్ధతిలో నికర లాభం 17.6 శాతం మెరుగై రూ. 8,834 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా బలపడి రూ. 17,684 కోట్లయ్యింది. కేటాయింపులు ఇలా క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.17 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగాయి. మొండిరుణాలు, కంటింజెన్సీలకు రూ. 200 కోట్లు అధికంగా రూ. 3,925 కోట్లను కేటాయించింది. కరోనా మహమ్మారి భయాలకుతోడు.. సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా.. క్యూ2లో కనీస మూలధన నిష్పత్తి 19.1 శాతం నుంచి 20 శాతానికి మెరుగుపడింది. ఈ కాలంలో బాసెల్–3 ప్రమాణ అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా బిలియన్ డాలర్లు(రూ. 7,424 కోట్లు) సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. టర్న్అరౌండ్.. డిపాజిట్లు స్వీకరించని అనుబంధ ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ క్యూ2లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ. 85 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. తాజా సమీక్షా కాలంలో దాదాపు రూ. 192 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. బ్రోకింగ్ అనుబంధ కంపెనీ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సైతం 44 శాతం వృద్ధితో రూ. 240 కోట్ల నికర లాభం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 17% ఎగసి రూ. 16,564 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 70,523 కోట్ల నుంచి రూ. 75,526 కోట్లకు పురోగమించింది. -
తగ్గిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూన్ త్రైమాసి కం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.318 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.834 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ రూ.1,224 కోట్ల నుంచి రూ.1,897 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి రూ.2,331 కోట్లకు ఎగబాకాయి. ఎయిర్‌పోర్టుల ఆదాయం రూ.494 కోట్ల నుంచి రూ.898 కోట్లుగా ఉంది. విద్యుత్ విభాగం ఆదాయం రూ.300 కోట్ల నుంచి రూ.446 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర శుక్రవారం 0.89 శాతం తగ్గి రూ.27.90 వద్ద స్థిరపడింది. -
అరబిందో లాభం రూ.770 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా ప్రకటించింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.9 శాతం ఎగసి రూ.770 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.5,540 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్రోల్‌ను మినహాయించారు. యూఎస్ ఫార్ములేషన్స్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్థిరంగా ఉండి రూ.2,681 కోట్లు సాధించింది. యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19.7 శాతం వృద్ధితో రూ.1,583 కోట్లు నమోదు చేసింది. ఏపీఐల ఆదాయం రూ.780 కోట్ల నుంచి రూ.812 కోట్లకు చేరింది. ఆదాయంలో 6.3 శాతం.. పరిశోధన, అభివృద్ధికి రూ.358 కోట్లు వెచ్చించారు. ఆదాయంలో ఇది 6.3 శాతం. మూడు ఇంజెక్టేబుల్స్తో కలిపి నాలుగు ఏఎన్‌డీఏలకు యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతి లభించింది. 2021–22 ఏడాదికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు సమ్మతించింది. సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో త్రైమాసిక పనితీరు సంస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా తెలిపారు. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో అరబిందో 51% మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. అలాగే అనుబంధ కంపెనీలైన ఆరోనెక్సŠట్ ఫార్మా, ఎమ్వియెస్ ఫార్మా వెంచర్స్‌ను అరబిందో ఫార్మాలో విలీనం చేయనున్నట్టు ప్రకటించింది. అరబిందో షేరు ధర గురువారం 3.64 శాతం తగ్గి రూ.825.70 వద్ద స్థిరపడింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 220 శాతం దూసుకెళ్లి రూ. 1,182 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 369 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2020 ఏప్రిల్ 1నుంచి అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేసుకుంది. వ్యయాల నియంత్రణ, వడ్డీ, వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి వంటి అంశాలు లాభదాయకతకు దోహదం చేసినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. చౌకలో నిధుల సమీకరణకు విలీనం సహకరించినట్లు తెలియజేశారు. మార్జిన్లు అప్ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 3,994 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 41 శాతం ఎగసి రూ. 1,877 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.51 శాతం బలపడి 2.85 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.9 శాతం నుంచి 9.69%కి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 3.76% నుంచి 3.47%కి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 4,204 కోట్లుగా నమోదయ్యాయి. నగదు రికవరీ రూ. 657 కోట్లకు చేరగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,290 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు 0.6% పుంజుకుని రూ. 139 వద్ద ముగిసింది. -
జీఎంఆర్‌కు రూ.1,127 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.1,127 కోట్ల నష్టం చవిచూసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.2,353 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.1,994 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది. ఎబిటా రూ.655 కోట్లుగా ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,198 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,466 కోట్ల నష్టం పొందింది. టర్నోవరు రూ.7,576 కోట్ల నుంచి రూ.8,556 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం నాల్గవ త్రైమాసికంలో రూ.1,582 కోట్లు, ఆర్థిక సంవత్సరంలో రూ.6,191 కోట్లు నమోదైంది. -
నిరాశపరిచిన జీ ఎంటర్టైన్మెంట్
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ.766 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.292 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం 4 శాతం తగ్గి రూ.1,992 కోట్లుగా నమోదైంది. ప్రకటనల రూపంలో ఆదాయం 15 శాతం క్షీణించి రూ.1,039 కోట్లుగా ఉంది. 2019–20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 67 శాతం తగ్గి రూ.524 కోట్లకు చేరగా, ఆదాయం రూ.8,185 కోట్ల నుంచి రూ.8,413 కోట్లకు పెరిగింది. -
కోరమాండల్ లాభం 301 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 301 శాతం అధికమై రూ.250 కోట్లు నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4.87 శాతం పెరిగి 7.8 శాతంగా ఉంది. ఎబిటా 113 శాతం హెచ్చి రూ.415 కోట్లుంది. టర్నోవరు రూ.2,141 కోట్ల నుంచి రూ.3,224 కోట్లకు దూసుకెళ్లింది. ఒకవైపు కోవిడ్–19 మహమ్మారి ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు నమోదు చేశామని సంస్థ ఎండీ సమీర్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. నూట్రియెంట్ మరియు అనుబంధ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని చెప్పారు. ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్ విక్రయాలు 75 శాతం అధికమైందని వెల్లడించారు. మార్కెట్ వాటా 13.2 నుంచి 16 శాతానికి ఎగబాకిందని పేర్కొన్నారు. -
61% పడిపోయిన బజాజ్ ఆటో లాభం
న్యూఢిల్లీ: లాక్డౌన్ ప్రభావం బజాజ్ ఆటో కంపెనీపై గట్టిగానే పడింది. జూన్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.395 కోట్లు.. ఆదాయం రూ.3,079 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే లాభం, ఆదాయం 61 శాతం మేర తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,012 కోట్ల లాభం, రూ.7,776 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. స్టాండలోన్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,126 కోట్ల నుంచి రూ.528 కోట్లకు తగ్గిపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 4,43,103 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,51,000 యూనిట్లు (విలువ పరంగా రూ.1,651 కోట్లు) ఎగుమతి చేసినవే. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,47,174 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మొదటి త్రైమాసికం పూర్తిగా సవాళ్లతో కొనసాగింది. లాక్డౌన్, వైరస్ నియంత్రణ చర్యలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించడంతో మొత్తం మీద డిమాండ్ తగ్గింది’’ అని బజాజ్ ఆటో తెలిపింది. ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్టు కంపెనీ అంగీకరించింది. -
ఐటీ బోణీ బాగుంది!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19 జనవరి–మార్చి) నాలుగో త్రైమాసిక కాలంలో నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరిగినట్లు అయిందని టీసీఎస్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.6,904 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ గోపీనాధన్ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.32,075 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతం వృద్ధితో రూ.38,010 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆదాయం పరంగా నాలుగేళ్లలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి అని పేర్కొన్నారు. ‘‘డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 2,000 కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. వార్షికంగా 13 శాతం, సీక్వెన్షియల్‌గా 2 శాతం వృద్ధి సాధించాం. రానున్న క్వార్టర్లలో ఇదే జోరు కొనసాగుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కో షేర్‌కు రూ.18 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నాం. దీన్ని వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన నాలుగు రోజులకు చెల్లిస్తాం’’ అని వివరించారు. రూపాయి బలపడినప్పటికీ, కంపెనీ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో ఆ ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు అధిగమించగలిగామన్నారు. ఎబిట్ మార్జిన్ 25.1 శాతం.. ఎబిట్ మార్జిన్ 15 బేసిస్ పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరిందని రాజేశ్ తెలియజేశారు. ఎబిట్ మార్జిన్ రూ.9,537 కోట్లుగా నమోదైందని తెలిపారు. నికర లాభం, ఆదాయం పరంగా మార్కెట్ విశ్లేషకుల అంచనాలను టీసీఎస్ ఫలితాలు అధిగమించాయి. అయితే ఎబిట్, మార్జిన్ల పరంగా అంచనాలను ఈ ఫలితాలు అందుకోలేకపోయాయి. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి...! బ్యాంకింగ్, ఆర్థిక సేలు, బీమా విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.13,650 కోట్లకు పెరిగిందని రాజేశ్ చెప్పారు. కంపెనీ డిజిటల్ విభాగం ఆదాయం 46 శాతం ఎగసిందని. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం ఆదాయం వాటా 31 శాతంగా ఉందని పేర్కొన్నారు. రిటైల్, సీపీజీ, తయారీ రంగ విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు. గత మూడు క్వార్టర్ల పరంగా చూస్తే, ఆర్డర్ బుక్ అధికంగా ఉందని రాజేశ్ తెలిపారు. వివిధ క్లయింట్లతో డీల్స్ కుదుర్చుకునే ప్రక్రియ జోరుగా సాగుతోందని తెలిపారు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభారంభమే ఉండగలదని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 22 శాతం వృద్ధితో రూ.31,472 కోట్లకు, ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.1,46,463 కోట్లకు పెరిగాయని రాజేశ్ గోపీనాధన్ వెల్లడించారు. నిర్వహణ మార్జిన్ 25.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. నికరంగా 29,287 ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.24,285కు చేరిందని వివరించారు. దీంట్లో మహిళా ఉద్యోగుల శాతం 36 శాతంగా ఉందని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ఇన్ఫీ లాభం రూ.4,078 కోట్లు ఆదాయం 19.1 శాతం వృద్ధి; రూ.21,539 కోట్లు షేరుకు రూ.10.5 తుది డివిడెండ్... 2019–20 ఆదాయ వృద్ధి అంచనా 7.5–9.5 శాతం బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) కంపెనీ రూ.4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,690 కోట్లతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 19.1 శాతం వృద్ధి చెంది రూ.18,083 కోట్ల నుంచి రూ.21,539 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,910 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గానూ జోరు...: గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ లాభం రూ.3,610 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ4లో లాభం 12.88% వృద్ధి చెందింది. ఆదాయం 0.6% పెరిగింది. పూర్తి ఏడాదికి చూస్తే..: 2018–19 పూర్తి ఏడాదిలో ఇన్ఫోసిస్ రూ.15,410 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017–18లో నికర లాభం రూ.16,029 కోట్లతో పోలిస్తే 3.9% తగ్గింది. మొత్తం ఆదాయం 17.2% వృద్ధితో రూ.70,522 కోట్ల నుంచి రూ.82,675 కోట్లకు పెరిగింది. గైడెన్స్ ఇలా...: ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 7.5–9.5 శాతం మేర వృద్ధి చెందొచ్చని కంపెనీ అంచనా(గైడెన్స్) వేసింది. కాగా, విశ్లేషకులు అంచనా వేసిన 8–10 శాతం కంటే కంపెనీ పేర్కొన్న గైడెన్స్ తక్కువగా ఉండటం గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► 2018–19 చివరి క్వార్టర్(జనవరి–మార్చి)లో కంపెనీ డిజిటల్ ఆదాయాలు 41.1 శాతం వృద్ధితో 1,035 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. కంపెనీ మొత్తం ఆదాయాల్లో ఈ విభాగం వాటా 33.8 శాతం కావడం గమనార్హం. ► మార్చి చివరినాటికి కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,279కి చేరింది. డిసెంబర్ చివరికి ఈ సంఖ్య 1,251. క్యూ4లో మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.57 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా నిరంజన్ రాయ్‌ను ఈ ఏడాది మార్చి 1 నుంచి నియమించినట్లు కంపెనీ ప్రకటించింది. ► జనవరి–మార్చి క్వార్టర్లో ఇన్ఫీలో నికరంగా 2,622 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మార్చి చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2.28 లక్షలకు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) 20.4 శాతంగా నమోదైంది. ► క్యూ4లో ఇన్ఫీ ఒక్కో షేరుకు రూ.10.5 చొప్పన తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం ఇచ్చిన రూ.7 మధ్యంతర డివిడెండ్‌తో కలిపితే 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం డివిడెండ్ రూ.17.5కు చేరుతుంది. గురువారం ఇన్ఫీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.747.85 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలు మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ‘పటిష్టమైన ఫలితాలతో గతేడాది మంచి పురోగతిని సాధించాం. ఆదాయ వృద్ధి, డిజిటల్ వ్యాపారాలతో సహ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదైంది. భారీ కాంట్రాక్టులను దక్కించుకోవడం, క్లయింట్లతో మంచి సంబంధాలు కూడా దీనికి దోహదం చేసింది. ప్రణాళికాబద్దంగా మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ -
కోరమాండల్ లాభం రూ.402 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ 2014-15 కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే రూ.356 కోట్ల నుంచి రూ.402 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.10,053 కోట్ల నుంచి రూ.11,306 కోట్లకు ఎగసింది. క్యూ4లో రూ.2,997 కోట్ల టర్నోవర్‌పై రూ.68 కోట్ల నికర లాభం పొందింది. 2013-14 క్యూ4లో రూ.2,184 కోట్ల టర్నోవర్‌పై రూ.81 కోట్ల నికర లాభం పొందింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.