న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ప్రభావం బజాజ్ ఆటో కంపెనీపై గట్టిగానే పడింది. జూన్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.395 కోట్లు.. ఆదాయం రూ.3,079 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే లాభం, ఆదాయం 61 శాతం మేర తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,012 కోట్ల లాభం, రూ.7,776 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. స్టాండలోన్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,126 కోట్ల నుంచి రూ.528 కోట్లకు తగ్గిపోయింది.
జూన్ త్రైమాసికంలో కంపెనీ 4,43,103 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,51,000 యూనిట్లు (విలువ పరంగా రూ.1,651 కోట్లు) ఎగుమతి చేసినవే. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,47,174 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మొదటి త్రైమాసికం పూర్తిగా సవాళ్లతో కొనసాగింది. లాక్‌డౌన్, వైరస్ నియంత్రణ చర్యలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించడంతో మొత్తం మీద డిమాండ్ తగ్గింది’’ అని బజాజ్ ఆటో తెలిపింది. ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్టు కంపెనీ అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment