Bajaj Auto Company
-
చిప్ కొరత.. బజాజ్ ఆటో లాభం డౌన్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం నామమాత్ర క్షీణతతో రూ. రూ. 1,163 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,170 కోట్లు ఆర్జించింది. చిప్ కొరత అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 7,386 కోట్ల నుంచి రూ. 8,005 కోట్లకు ఎగసింది. ఇందుకు ధరల పెంపు, డాలర్ బలపడటం సహకరించింది. అమ్మకాల పరిమాణం మాత్రం 7 శాతం నీరసించి 9,33,646 యూనిట్లకు చేరింది. గతేడాది క్యూ1లో 10.06 లక్షలకుపైగా వాహనాలు విక్రయించింది. తొలుత సెమీకండక్టర్ల కొరత సమస్యలు సృష్టించినప్పటికీ తదుపరి ఇతర మార్గాలలో సరఫరాలు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 1,061 కోట్ల నుంచి రూ. 1,173 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీ అమ్మకాలు 1 శాతం తగ్గి 3,52,836 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మరింత అధికంగా 10 శాతం క్షీణించి 5,80,810 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో 2.25 శాతం బలహీనపడి రూ. 3,932 వద్ద ముగిసింది. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 బైక్.. పల్సర్ 150 కంటే రేటు ఎక్కువ
బజాజ్ ఆటో ఇటీవల తన పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ ధరను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు జూలై 1, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కసారిగా ధరల భారీగా పెరగడంతో పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ బైక్, పల్సర్ 150 నియాన్ ఎబీఎస్ బైక్ కంటే ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం ఈ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ మోటార్ సైకిల్ ధర ఇప్పుడు షోరూమ్ లలో రూ.99,296(ఎక్స్ షోరూమ్, ఫరీదాబాద్) ధరకు లభిస్తోంది. మునుపటి ధరలతో పోలిస్తే ఇప్పుడు దీని ధర రూ.4,416 పెరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే, ప్రస్తుతం పల్సర్ 150 నియాన్ ఎబీఎస్ బైక్ ధర రూ.98,259(ఎక్స్ షోరూమ్, ఫరీదాబాద్) కంటే పల్సర్ ఎన్ఎస్125 ధర రూ.1,037 ఎక్కువ. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న 125 సీసీ మోటార్ సైకిళ్లలో ఎన్ఎస్ 125 ఒకటి. ఈ బైక్ సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్ప్లిట్ స్టైల్డ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ప్రస్తుతం సింగిల్ వేరియెంట్లో మాత్రమే లభ్యం అవుతోంది. వినియోగదారులకు బర్న్డ్ రెడ్, ప్యూటర్ గ్రే, ఆరెంజ్, సఫ్ ఫైర్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్ 124.45సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.6 హెచ్ పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఐదు గేర్లు ఉన్నాయి. మోటార్ సైకిల్ సస్పెన్షన్ సిస్టమ్ లో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ముందే ఉంటే, వెనుక రియర్ మోనోషాక్ ఉంది. -
బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చిన కంపెనీలు
న్యూఢిల్లీ: బజాజ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చాయి కంపెనీలు. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టీవీఎస్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ అపాచీ ధరలను పెంచగా, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ వారి మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణి ధరలను పెంచాయి. ఈ కొత్త ధరలు జనవరి 2021 నుంచి తయారు చేయబడిన, విక్రయించే బైక్‌లు, స్కూటర్లపై పెంపు ధరలు వర్తిస్తాయని పేర్కొంది. టీవీఎస్ సంస్థ తన ప్రధాన మోటారుసైకిల్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలను రూ.3 వేలకు పెంచింది. ఈ మోటారుసైకిల్ ఇప్పుడు 2.48 లక్షల రూపాయల ధర వద్ద లభిస్తుంది.(చదవండి: బీఎండబ్ల్యూ కొత్త కారు అదిరిందిగా) మరోవైపు, అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధరను రూ.2,000 పెరిగి 1.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ముంబై) లభిస్తుంది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1,770, ఆర్టీఆర్ 180, ఆర్టీఆర్ 160 ధరలు వరుసగా రూ.1770, రూ.1520 పెరిగాయి. బజాజ్ సంస్థ తన అవెంజర్ క్రూయిజర్ 220 ధరలను 3,521 రూపాయలు పెంచింది, ఇప్పుడు దీని ధర రూ .1.24 లక్షలు. మరోవైపు, డొమినార్ 400, డొమినార్ 250 ధరలను వరుసగా 3,480 మరియు 3,500 రూపాయలు వరకు పెంచారు. పల్సర్ 220ఎఫ్ ధరను రూ.3,500 పెంచడంతో అది రూ.1.25 లక్షలకు చేరుకుంది. ఎన్ఎస్160, ఎన్ఎస్ 200 ధరలను వరుసగా రూ.3,000, రూ.3,500 పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన ఆర్ఈ క్లాసిక్ 350 ధరలను సుమారు రూ.2,000 పెంచారు. ఈ శ్రేణి ఇప్పుడు రూ.1.63 లక్షలు నుంచి రూ.1.85 లక్షల ధరలలో లభిస్తుంది. బుల్లెట్ సిరీస్ ధరలు కూడా పెరగడంతో అవి ఇప్పుడు రూ.1.27 లక్షల నుంచి 1.43 లక్షల ధరలలో లభిస్తున్నాయి. క్లాసిక్, బుల్లెట్ బైక్స్ వంటి బైక్స్ ధర రూ.2 వేల వరకు పైకి చేరింది. అదే మెటిరో 350 ధర మాత్రం రూ.3 వేలు పెరిగింది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనే వారికి ఝలక్ తగిలిందని చెప్పుకోవచ్చు. -
61% పడిపోయిన బజాజ్ ఆటో లాభం
న్యూఢిల్లీ: లాక్డౌన్ ప్రభావం బజాజ్ ఆటో కంపెనీపై గట్టిగానే పడింది. జూన్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.395 కోట్లు.. ఆదాయం రూ.3,079 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే లాభం, ఆదాయం 61 శాతం మేర తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,012 కోట్ల లాభం, రూ.7,776 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. స్టాండలోన్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,126 కోట్ల నుంచి రూ.528 కోట్లకు తగ్గిపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 4,43,103 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,51,000 యూనిట్లు (విలువ పరంగా రూ.1,651 కోట్లు) ఎగుమతి చేసినవే. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,47,174 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మొదటి త్రైమాసికం పూర్తిగా సవాళ్లతో కొనసాగింది. లాక్డౌన్, వైరస్ నియంత్రణ చర్యలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించడంతో మొత్తం మీద డిమాండ్ తగ్గింది’’ అని బజాజ్ ఆటో తెలిపింది. ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్టు కంపెనీ అంగీకరించింది. -
బజాజ్ ఆటో లాభం రూ.1,523 కోట్లు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను ఆదా కావడం కలసి వచ్చిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.7,707 కోట్లకు చేరిందని పేర్కొంది. పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం రూ.2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెపె్టంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. కాగా, గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 11.73 లక్షలకు తగ్గాయని బజాజ్ ఆటో తెలిపింది. మోటార్ బైక్‌ల విక్రయాలు 11.26 లక్షల నుంచి 12 శాతం తగ్గి 9.84 లక్షలకు తగ్గాయని పేర్కొంది. -
బజాజ్ సీటీ 110 @: రూ.37,997
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్ ‘సీటీ 110’లో నూతన వెర్షన్‌ను విడుదలచేసింది. చౌక ధరలో అధునాతన ఫీచర్లను జోడించిన ఈ బైక్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ.37,997 (ఎక్స్–షోరూమ్, ఢిల్లీ) కాగా, ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్ కలిగిన బైక్ ధర రూ.44,480 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ నూతన వెర్షన్లో మరింత బలమైన, విశాల క్రాష్ గార్డ్స్ ఉన్నాయని.. క్రితం మోడల్‌తో పోల్చితే గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగినట్లు వివరించింది. మెరుగైన సస్పెన్షన్ కలిగిన ఈ బైక్‌కు 115సీసీ ఇంజిన్ అమర్చింది. -
మార్కెట్లోకి కేటీఎమ్ ‘ఆర్సీ 125 ఏబీఎస్’
న్యూఢిల్లీ: ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎమ్.. ‘ఆర్సీ 125 ఏబీఎస్’ పేరుతో అధునాతన బైక్‌ను బుధవారం ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేసింది. 124.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.47 లక్షలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 470 కేటీఎమ్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, నెలాఖరు నుంచి డెలివరీలు చేస్తామని వెల్లడించింది. పనితీరు పరంగా కేటీఎమ్ బైక్‌లు ఉత్తమ ప్రదర్శన చూపుతున్నట్లు ఈ సంస్థకు భారత భాగస్వామి అయిన బజాజ్ ఆటో పేర్కొంది. -
వచ్చే ఏడాదే బజాజ్ ‘ఎలక్ట్రిక్’ ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న వేళ... వచ్చే ఏడాదే ఎలక్ట్రిక్ వాహనాల్లోకి ప్రవేశించనున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు. బీఎస్–6 కాలుష్య విడుదల నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల ఇంజన్లను మార్చడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల్లోకి ప్రవేశం కూడా వచ్చే ఏడాది ఉంటుందన్నారు. ‘‘ఎలక్ట్రిక్ క్యూట్, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు (ఆటోలు) తమ ఎజెండాలో ముందున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా మా పెట్రోల్, డీజిల్ ఇంజన్లను రూపొందించనున్నాం’’ అని రాజీవ్ తెలిపారు. కేటీఎంకు చెందిన హస్క్‌వర్న మోటారు సైకిల్ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి ఈ ఏడాదే తీసుకురానున్నట్టు రాజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో తన నాలుగు చక్రాల క్యూట్ (క్వాడ్రిసైకిల్)ను ఇప్పటికే 20 దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం గమనార్హం. మార్చిలో దేశీయ రోడ్లపైకి క్యూట్ భారత్‌లో క్యూట్‌ను ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న ప్రశ్నకు... మార్చిలో జరగొచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. తుది అనుమతుల ప్రక్రియలో ఉందన్నారు. బజాజ్ ఈ స్కూటర్..: ఎలక్ట్రిక్ క్యూట్, మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు తమ అజెండాలో ముందున్నట్టు రాజీవ్ బజాజ్ ప్రకటించారు. అయితే, బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ కూడా రానుందని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ‘‘బజాజ్ నుంచి మీరు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అంచనా వేస్తున్నట్టయితే అది ఈ రోజు సాధ్యపడదు. కానీ, త్వరలోనే ఇది జరగనుంది’’ అని రాజీవ్ చెప్పారు. ‘ది వరల్డ్ ఫేవరెట్ ఇండియన్’ దేశీయ సంస్థ బజాజ్ ఆటో 17 ఏళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సాధించిన పురోగతిపై ‘ద వరల్డ్ ఫేవరెట్ ఇండియన్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజీవ్ బజాజ్ సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్రవాహన ఎగుమతుల్లో బజాజ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, సంస్థ ఆదాయంలో 40% విదేశీ మార్కెట్ల నుంచే వస్తున్నట్టు చెప్పారు. 70 దేశాల్లో 15 మిలియన్ల వాహనాల అమ్మకాలతో కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అయిన ‘మేకిన్ ఇండియా’కు చిరునామాగా బజాజ్ నిలిచిందని రాజీవ్ వివరించారు. గత పదేళ్లలో సంస్థ 13 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పాల్గొన్నారు. -
అదో టైమ్ వేస్ట్ కార్యక్రమం
న్యూఢిల్లీ: వార్షిక బడ్జెట్ రూపకల్పనా ప్రక్రియ ప్రారంభమవుతోందంటే... పారిశ్రామికవేత్తలు వారి కోర్కెలు ప్రభుత్వానికి తెలియజేయడానికి, వాటికి బడ్జెట్లో స్థానం కల్పించేలా చూడ్డానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంటారు. ఇక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా చూడ్డం, ఆయా ప్రతిపాదనలపై వ్యాఖ్యలు చేయడం, తమ అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వంటి అంశాల్లో ఆయా వర్గాల హడావుడి అంతా ఇంతా కాదు. అయితే దీనిపై బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి సమర్పించడానికి తన వద్ద ‘విష్‌లిస్ట్’ ఏదీ లేదన్నారు. అసలు బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు టీవీల్లో ఈ కార్యక్రమాన్ని చూడ్డమే దండుగ అన్నారు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారమని వ్యాఖ్యానించారు. ‘4 గంటల పాటు బడ్జెట్ ప్రసంగం చూసి, బుర్రపై భారం వేసుకునే బదులు, ఆ సమయాన్ని ఏదైనా ఉత్పాదక అంశంపై సద్వినియోగం చేసుకుంటే మంచిది. ద్విచక్ర వాహనాలను లగ్జరీ ఐటమ్‌గా పరిగణించి 28% జీఎస్టీ విధించడం తగదు. 18% పరిధిలో ఉండాలి’ అని అన్నారు. -
బజాజ్ పల్సర్ కు రికార్డ్ స్థాయిలో అవార్డులు
హైదరాబాద్: బజాజ్ ఆటో కంపెనీకి చెందిన పల్సర్ బైక్ రికార్డ్ స్థాయిలో 15 అవార్డులను సాధించింది. భారత ఆటోమొబైల్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో అవార్డులు సాధించిన బైక్‌గా పల్సర్ ఆర్ఎస్ 200 నిలిచిందని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ సంస్థలందించే ఇయర్ ఆఫ్ ద బైక్ అవార్డులతో పాటు వివిధ కేటగిరిల్లో ఉత్తమ బైక్‌గా కూడా అవార్డులను ఈ పల్సర్ఆర్ఎస్ 200 బైక్ గెల్చుకుందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్వాస్ పేర్కొన్నారు. ఈ అవార్డులు బజాజ్ ఆటో నిబద్ధతకు, ఉత్పత్తి నాణ్యతకు గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. దేశీయ స్పోర్ట్స్ మోటార్‌బైక్ మార్కెట్లో ప్రతి నెలా 50 వేల పల్సర్ బైక్‌లు విక్రయమవుతున్నాయని పేర్కొన్నారు. భారత దేశపు నంబర్ వన్ స్పోర్ట్స్ సెల్లింగ్ బైక్‌గా 14 సంవత్సరాలు నిలిచిందని వివరించారు. -
బజాజ్ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్
న్యూఢిల్లీ : బజాజ్ ఆటో కంపెనీ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్(నాలుగు కార్ల వాహనం)ను శుక్రవారం ఆవిష్కరించింది. క్యూట్ పేరుతో అందిస్తున్న ఈ వాహనం ధర 2,000 డాలర్లని(సుమారుగా రూ.1.35 లక్షలు) బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. సుప్రీం కోర్టులో ఈ వాహనంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణలో ఉన్నందున వీటిని భారత్‌లో విక్రయిచండం లేదని, విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. వాటర్ కూల్డ్ డీటీఎస్ఐ, ఫోర్ వాల్వ్ 217 సీసీ ఇంజిన్, మైలీజీ 36 కిమీపర్ లీటర్ అని, గరిష్ట వేగం గంటకు 70 కిమీ. అని రాజీవ్ బజాజ్ వివరించారు. -
బజాజ్ డిస్కవర్, ప్లాటినా రేట్ల పెంపు!
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ డిస్కవర్, ప్లాటినా బైక్‌ల ధరలను పెంచాలని యోచిస్తోంది. వచ్చే నెలలో ఈ బైక్‌ల ధరలను పెంచాలని యోచిస్తున్నామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(మోటార్ సైకిళ్ల విభాగం) ఎరిక్ వ్యాస్ శుక్రవారమిక్కడ తెలిపారు. కార్మికుల వేతనాలు, విద్యుత్ చార్జీలు, తదితర ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని, దీనిని తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించారు. ధరలను ఎంత శాతం పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ బైక్‌ల అమ్మకాల పనితీరు, ఎక్సైజ్ సుంకం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ధరలు ఎంత పెంచాలన్నది నిర్ణయిస్తామని వివరించారు. నవంబర్ నెలలో మోటార్ బైక్‌ల అమ్మకాలు 6 శాతం తగ్గాయని, ఈ నెలలో కూడా ఇదే స్థాయి అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు వ్యాస్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రధాన మోడల్ పల్సర్ బైక్‌ల ధరలను ఈ కంపెనీ రూ.1,000 వరకూ పెంచడం తెలిసిందే. ప్లాటినా, డిస్కవర్ బైక్‌లతో పాటు పల్సర్, అవెంజర్, నింజా తదితర బైక్‌లను బజాజ్ ఆటో విక్రయిస్తోంది.