న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం నామమాత్ర క్షీణతతో రూ. రూ. 1,163 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,170 కోట్లు ఆర్జించింది. చిప్ కొరత అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 7,386 కోట్ల నుంచి రూ. 8,005 కోట్లకు ఎగసింది.
ఇందుకు ధరల పెంపు, డాలర్ బలపడటం సహకరించింది. అమ్మకాల పరిమాణం మాత్రం 7 శాతం నీరసించి 9,33,646 యూనిట్లకు చేరింది. గతేడాది క్యూ1లో 10.06 లక్షలకుపైగా వాహనాలు విక్రయించింది. తొలుత సెమీకండక్టర్ల కొరత సమస్యలు సృష్టించినప్పటికీ తదుపరి ఇతర మార్గాలలో సరఫరాలు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 1,061 కోట్ల నుంచి రూ. 1,173 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీ అమ్మకాలు 1 శాతం తగ్గి 3,52,836 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మరింత అధికంగా 10 శాతం క్షీణించి 5,80,810 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.25 శాతం బలహీనపడి రూ. 3,932 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment