న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,596 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,002 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం వృద్ధితో రూ. 9,283 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 6,743 కోట్ల ఆదాయం సాధించింది.
నికర వడ్డీ ఆదాయం 33 శాతం పుంజుకుని రూ. 7,920 కోట్లుకాగా.. కొత్త రుణాల సంఖ్య 60 శాతం ఎగసి 74.2 లక్షలకు చేరింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 30 శాతం మెరుగై రూ. 2,04,018 కోట్లను తాకాయి. రుణ నష్టాలు, కేటాయింపులు సగానికిపైగా తగ్గి రూ. 755 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ1లో ఇవి రూ. 1,750 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 2.96 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.46 శాతం నుంచి 0.51 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 26.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.3 శాతం బలపడి రూ. 6,408 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment