సలీల్ పరేఖ్, రాజేశ్ గోపీనాధన్
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19 జనవరి–మార్చి) నాలుగో త్రైమాసిక కాలంలో నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరిగినట్లు అయిందని టీసీఎస్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో రూ.6,904 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ గోపీనాధన్ పేర్కొన్నారు.
అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.32,075 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతం వృద్ధితో రూ.38,010 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆదాయం పరంగా నాలుగేళ్లలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి అని పేర్కొన్నారు. ‘‘డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 2,000 కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. వార్షికంగా 13 శాతం, సీక్వెన్షియల్‌గా 2 శాతం వృద్ధి సాధించాం. రానున్న క్వార్టర్లలో ఇదే జోరు కొనసాగుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కో షేర్‌కు రూ.18 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నాం. దీన్ని వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన నాలుగు రోజులకు చెల్లిస్తాం’’ అని వివరించారు. రూపాయి బలపడినప్పటికీ, కంపెనీ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో ఆ ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు అధిగమించగలిగామన్నారు.
ఎబిట్ మార్జిన్ 25.1 శాతం..
ఎబిట్ మార్జిన్ 15 బేసిస్ పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరిందని రాజేశ్ తెలియజేశారు. ఎబిట్ మార్జిన్ రూ.9,537 కోట్లుగా నమోదైందని తెలిపారు. నికర లాభం, ఆదాయం పరంగా మార్కెట్ విశ్లేషకుల అంచనాలను టీసీఎస్ ఫలితాలు అధిగమించాయి. అయితే ఎబిట్, మార్జిన్ల పరంగా అంచనాలను ఈ ఫలితాలు అందుకోలేకపోయాయి.
అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి...!
బ్యాంకింగ్, ఆర్థిక సేలు, బీమా విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.13,650 కోట్లకు పెరిగిందని రాజేశ్ చెప్పారు. కంపెనీ డిజిటల్ విభాగం ఆదాయం 46 శాతం ఎగసిందని. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం ఆదాయం వాటా 31 శాతంగా ఉందని పేర్కొన్నారు. రిటైల్, సీపీజీ, తయారీ రంగ విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు. గత మూడు క్వార్టర్ల పరంగా చూస్తే, ఆర్డర్ బుక్ అధికంగా ఉందని రాజేశ్ తెలిపారు. వివిధ క్లయింట్లతో డీల్స్ కుదుర్చుకునే ప్రక్రియ జోరుగా సాగుతోందని తెలిపారు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభారంభమే ఉండగలదని పేర్కొన్నారు.
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 22 శాతం వృద్ధితో రూ.31,472 కోట్లకు, ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.1,46,463 కోట్లకు పెరిగాయని రాజేశ్ గోపీనాధన్ వెల్లడించారు. నిర్వహణ మార్జిన్ 25.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. నికరంగా 29,287 ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.24,285కు చేరిందని వివరించారు. దీంట్లో మహిళా ఉద్యోగుల శాతం 36 శాతంగా ఉందని తెలిపారు.
మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది.
ఇన్ఫీ లాభం రూ.4,078 కోట్లు
ఆదాయం 19.1 శాతం వృద్ధి; రూ.21,539 కోట్లు
షేరుకు రూ.10.5 తుది డివిడెండ్...
2019–20 ఆదాయ వృద్ధి అంచనా 7.5–9.5 శాతం
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) కంపెనీ రూ.4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,690 కోట్లతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 19.1 శాతం వృద్ధి చెంది రూ.18,083 కోట్ల నుంచి రూ.21,539 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,910 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు.
సీక్వెన్షియల్‌గానూ జోరు...: గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ లాభం రూ.3,610 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ4లో లాభం 12.88% వృద్ధి చెందింది. ఆదాయం 0.6% పెరిగింది.
పూర్తి ఏడాదికి చూస్తే..: 2018–19 పూర్తి ఏడాదిలో ఇన్ఫోసిస్ రూ.15,410 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017–18లో నికర లాభం రూ.16,029 కోట్లతో పోలిస్తే 3.9% తగ్గింది. మొత్తం ఆదాయం 17.2% వృద్ధితో రూ.70,522 కోట్ల నుంచి రూ.82,675 కోట్లకు పెరిగింది.
గైడెన్స్ ఇలా...: ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 7.5–9.5 శాతం మేర వృద్ధి చెందొచ్చని కంపెనీ అంచనా(గైడెన్స్) వేసింది. కాగా, విశ్లేషకులు అంచనా వేసిన 8–10 శాతం కంటే కంపెనీ పేర్కొన్న గైడెన్స్ తక్కువగా ఉండటం గమనార్హం.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
► 2018–19 చివరి క్వార్టర్(జనవరి–మార్చి)లో కంపెనీ డిజిటల్ ఆదాయాలు 41.1 శాతం వృద్ధితో 1,035 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. కంపెనీ మొత్తం ఆదాయాల్లో ఈ విభాగం వాటా 33.8 శాతం కావడం గమనార్హం.
► మార్చి చివరినాటికి కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,279కి చేరింది. డిసెంబర్ చివరికి ఈ సంఖ్య 1,251. క్యూ4లో మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.57 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
► కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా నిరంజన్ రాయ్‌ను ఈ ఏడాది మార్చి 1 నుంచి నియమించినట్లు కంపెనీ ప్రకటించింది.
► జనవరి–మార్చి క్వార్టర్‌లో ఇన్ఫీలో నికరంగా 2,622 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మార్చి చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2.28 లక్షలకు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) 20.4 శాతంగా నమోదైంది.
► క్యూ4లో ఇన్ఫీ ఒక్కో షేరుకు రూ.10.5 చొప్పన తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం ఇచ్చిన రూ.7 మధ్యంతర డివిడెండ్‌తో కలిపితే 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం డివిడెండ్ రూ.17.5కు చేరుతుంది.
గురువారం ఇన్ఫీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.747.85 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలు మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి.
‘పటిష్టమైన ఫలితాలతో గతేడాది మంచి పురోగతిని సాధించాం. ఆదాయ వృద్ధి, డిజిటల్ వ్యాపారాలతో సహ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదైంది. భారీ కాంట్రాక్టులను దక్కించుకోవడం, క్లయింట్లతో మంచి సంబంధాలు కూడా దీనికి దోహదం చేసింది. ప్రణాళికాబద్దంగా మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
– సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment