న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 10,055 కోట్లను అధిగమించింది. ఇందుకు అన్ని విభాగాల్లోనూ రుణాలకు డిమాండ్ బలపడటం, మొండిరుణాలకు కేటాయింపులు తగ్గడం సహకరించింది.
మొత్తం ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 41,086 కోట్లకు చేరింది. రుణాలు 20.8 శాతం పెరిగి రూ. 13,68,821 కోట్లను తాకాయి. రుణాలలో రిటైల్ 15.2 శాతం, గ్రామీణ బ్యాంకింగ్ విభాగం 30.4 శాతం, హోల్‌సేల్ విభాగం 17.4 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. నికర వడ్డీ ఆదాయం 10.2 శాతం బలపడి రూ. 18,873 కోట్లకు చేరింది.
బ్రాంచీలు ప్లస్...
క్యూ4లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 563 బ్రాంచీలు తెరవగా 7,167 మంది ఉద్యోగులను జత చేసుకుంది. పూర్తి ఏడాదిలో 734 బ్రాంచీలు ఏర్పాటు చేయగా.. అదనంగా 21,486 మంది ఉద్యోగులు చేరారు. కాగా.. సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.4 శాతం నుంచి 0.32 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4,694 కోట్ల నుంచి రూ. 3,312 కోట్లకు దిగివచ్చాయి.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో బ్యాంక్ నికర లాభం 23.8 శాతం ఎగసి రూ. 10,443 కోట్లయ్యింది. పూర్తి ఏడాదికి 19.5 శాతం వృద్ధితో రూ. 38,053 కోట్లను తాకింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి (సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. 2021–22లో స్టాండెలోన్ నికర లాభం 19 శాతం అధికమై రూ. 36,961 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం రూ. 1,57,263 కోట్లకు చేరింది. ఇది 7.7 శాతం వృద్ధి. ఈ నెల 23న సమావేశంకానున్న బోర్డు డివిడెండును ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది.
బాండ్ల ద్వారా రూ.50,000 కోట్ల సమీకరణ!
బాండ్ల జారీ ద్వారా రూ. 50,000 కోట్ల వరకూ సమీకరించాలని బోర్డు నిర్ణయించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది. నిధులను ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరల గృహాలకు రుణాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. రానున్న 12 నెలల్లోగా బాండ్ల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది(2022) సెప్టెంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చే విధంగా రేణు కర్నాడ్‌ను తిరిగి నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనంకానున్న నేపథ్యంలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment