ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది.
స్టాండెలోన్ సైతం
క్యూ4లో స్టాండెలోన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది.
Comments
Please login to add a commentAdd a comment