న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్‌అండ్‌టీ సీఈవో ఎస్‌ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్‌అండ్‌టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది.
చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్
ఎల్‌అండ్‌టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్‌ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment