Larsen & Toubro
-
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
మెప్పించని ఎల్అండ్టీ....
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) మార్చితో ముగిసిన త్రైమాసికంలో మోస్తరు పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.3,620 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.3,293 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.49,116 కోట్ల నుంచి రూ.53,366 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,92,997 కోట్ల విలువ చేసే ఆర్డర్లను సంపాదించినట్టు సంస్థ తెలిసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. -
నిరాశపరిచిన ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: నిర్మాణం, ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) కన్సాలిడేటెడ్ (అనుబంధ కంపెనీలు కలిసిన) నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో ఏకంగా 67 శాతం పడిపోయి రూ.1,819 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.5,520 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.31,594 కోట్ల నుంచి రూ.35,305 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘క్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఎలక్ట్రిక్ వ్యాపారాన్ని ష్నీడర్‌కు విక్రయించడంతో పెద్ద ఎత్తున లాభం సమకూరింది. అలాగే, విదేశీ ఆస్తులకు సంబంధించి ఇంపెయిర్మెంట్ (పెట్టుబడుల విలువ క్షీణత) కూడా చేయాల్సి వచ్చింది’’ అని ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్ శంకర్రామన్ తెలిపారు. అటువంటివి సమీక్షా త్రైమాసికంలో లేవని చెప్పారు. నిర్వహణ లాభం 56 శాతం వృద్ధి చెందినట్టు చెప్పారు. నికర లాభంలో ఉత్తరాఖండ్‌లోని హైడల్ ప్లాంట్‌లో వాటాల విక్రయం రూపంలో వచ్చిన రూ.144 కోట్లు కూడా ఉన్నట్టు ఎల్అండ్టీ తెలిపింది. ఇక ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,994 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.42,140 కోట్ల కొత్త ఆర్డర్లను కంపెనీ సంపాదించుకుంది. కంపెనీ చేతిలో మొత్తం రూ.3,30,541 కోట్ల ఆర్డర్లున్నాయి. -
రెన్యూ పవర్ చేతికి ఎల్అండ్టీ హైడ్రో ప్రాజెక్టు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) తమ అనుబంధ సంస్థకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంటులో 100 శాతం వాటాలను రెన్యూ పవర్ సర్వీసెస్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 985 కోట్లు. ఇతర వ్యాపారాల నుంచి తప్పుకుని ప్రధాన వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టాలనే ప్రణాళికకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ డీకే సెన్ వెల్లడించారు. ఎల్అండ్టీ ఉత్తరాంచల్ హైడ్రోపవర్ (ఎల్‌టీయూహెచ్‌పీఎల్)కి చెందిన ఈ ప్రాజెక్టు విక్రయ డీల్ సెప్టెంబర్ 30లోగా పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టును కొనుగోలు చేయడం వల్ల తమకు అదనపు ప్రయోజనాలు లభించగలవని, రిస్కు స్థాయి కూడా తక్కువగా ఉండగలదని రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రో ప్రాజెక్టులన కొనుగోలుపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. -
చైనాకు చెక్: రూ. 50 వేల కోట్లతో ప్రాజెక్ట్-75కి ఆమోదం
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా రోజుకో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధవవుతోంది. ఈ క్రమంలో భారత నావికా దళం కోసం తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75కి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా 50 వేల కోట్ల రూపాయలతో ఆరు జలంతర్గాముల నిర్మాణానికి తుది అనుమతి లభించింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ జలంతార్గాములను నిర్మించనున్నారు. ఈ క్రమంలో రెండు భారతీయ కంపెనీలు, ఓ విదేశీ కంపెనీతో కలిసి పనిచేయడానికి అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్పీఎఫ్)ను జారీ చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన డిఫెన్స్ సమావేశంలో ఆర్‌ఎఫ్‌పీకు క్లియరెన్స్ ఇచ్చారు. మజాగావ్ డాక్స్ (ఎండీఎల్), ప్రైవేట్ షిప్-బిల్డర్ లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) లకు రక్షణ శాఖ ఆర్ఎఫ్పీ జారీ చేసింది. ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా క్రింద కలిసి పని చేస్తాయి. అంతేకాక భారత వ్యూహాత్మక భాగస్వాములు అయిన ఎండీఎల్, ఎల్ఆండ్టీ కపెంనీలు.. సాంకేతిక, ఆర్థిక బిడ్లను సమర్పించడానికి ఎంపిక చేసిన ఐదు విదేశీ షిప్‌యార్డులలో ఒకదానితో జతకడతాయి. ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరు అధునాతన జలంతర్గాములను మజగావ్ డాక్‌యార్డ్‌లో వీటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ జలంతర్గాముల కంటే దాదాపు 50శాతం పెద్దదైన ఈ ప్రాజెక్టు కింద ఆరు సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికాదళం భావిస్తోంది. ఈ జలాంతర్గాముల తయారీలో 95 శాతం దేశీయ వస్తువుల వినియోగించనున్నారు. మారిటైమ్ ఫోర్స్ స్పెసిఫికేషన్ల ప్రకారం.. జలాంతర్గాముల్లో హెవీ డ్యూటీ ఫైర్‌పవర్, కనీసం 12 ల్యాండ్ అటాక్ క్రూయిస్ క్షిపణులు (ఎల్ఐసీఎం), యాంటీ షిప్ క్రూయిస్ క్షిపణులు (ఏఎస్‌సీఎం) ఉండాలి. కొత్తగా అభివృద్ది చేయబోయే జలంతర్గాములు సముద్రంలో 18 హెవీవెయిట్ టార్పెడోలను మోసుకెళ్లే, ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నేవీ పేర్కొంది. తర్వాతి తరం స్కార్పియన్ శ్రేణి కంటే ఎక్కువ ఫైర్‌పవర్ అవసరం. ప్రస్తుతం భారత నావికాదళంలో 140కి పైగా జలాంతర్గాములు, ఉపరితల యుద్ధ నౌకలు ఉన్నాయి. పాక్ నావికాదళంలో 20 మాత్రమే ఉన్నాయి. మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది. చదవండి: ఇండో – పసిఫిక్ చౌరస్తా! -
ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు నిర్మాణ రంగ దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ ముందుకు వచ్చింది. ప్రతీ ఉద్యోగికి అదనంగా రూ.35 లక్షల కరోనా బీమా కవరేజీని ప్రకటించింది. అంటువ్యాధుల కవరేజీ ప్లాన్ కింద రూ.35 లక్షల బీమాను 12 నెలల కాలానికి అందించనున్నట్టు తెలిపింది. ఈ పాలసీ కింద కరోనా కారణంగా మరణించిన ఉద్యోగికి రూ.35 లక్షల పరిహారం లభించనుంది. ఇప్పటికే ప్రతీ ఉద్యోగికి అందిస్తున్న రూ.50-60 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఇది అదనం. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.2-12 లక్షల మధ్య ఆప్షనల్ టాపప్ మెడికల్ హాస్పిటలైజేషన్ కవరేజీని 365 రోజులకు అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.6.25 లక్షల వరకూ మెడికల్ కవరేజీ కూడా ఉంటుందని ఎల్అండ్టీ తెలిపింది. మరణించిన ఉద్యోగి పిల్లల చదువులకు కూడా సాయాన్ని ప్రకటించింది. 3 నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల విద్యకు అయ్యే వ్యయాలను సంస్థే భరించనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి వృత్తి శిక్షణ, విద్య అందించి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపింది. ‘‘ఎన్నో సవాళ్లతో కూడుకున్న కాలం ఇది. కరోనా రెండో దశ గట్టిగానే తాకింది. కరోనా కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో వెనుకాడేది లేదు. మా ఉద్యోగులకు సాయంగా ఉండేందుకు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు ఇవి’’ అని ఎల్అండ్టీ ఎండీ, సీఈవో ఎస్ఎన్ సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్త! -
ఎల్అండ్టీకి కోవిడ్ దెబ్బ
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కు కోవిడ్–19 ప్రభావం తీవ్రంగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,410 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,552 కోట్లతో పోలిస్తే 45 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం సైతం రూ.35,925 కోట్ల నుంచి రూ.31,594 కోట్లకు దిగజారింది. 12 శాతం తగ్గిపోయింది. కాగా, వ్యాపార పరిస్థితులు పుంజుకుంటుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా) లాభం సుమారు 4 రెట్లు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ‘కరోనా మహమ్మారి ప్రభావంతో ఆదాయం పడిపోయింది. ఆర్థిక సేవల వ్యాపారంలో అధిక క్రెడిట్ ప్రొవిజన్లు మెట్రో సేవలకు అంతరాయం కారణంగా లాభంలో 45 శాతం క్షీణతకు దారితీసింది’ అని కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం వ్యయాలు సైతం రూ.32,622 కోట్ల నుంచి రూ.29,456 కోట్లకు పడిపోయాయి. అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.12,148 కోట్లుగా నమోదైంది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కంపెనీ తన ఎలక్ట్రికల్, ఆటోమేషన్ (ఈఅండ్‌ఏ) వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్ ఎలక్ట్రిక్ (ఎస్ఈ)కు విక్రయించింది. క్యూ2లో గ్రూపు స్థాయిలో ఎల్అండ్టీ రూ.28,039 కోట్ల కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 42% తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు బుధవారం బీఎస్ఈలో 0.12% లాభంతో రూ.984 వద్ద ముగిసింది. -
ఎల్ అండ్ టీ లాభం 53% జంప్
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 53 శాతం పెరిగింది. నికర లాభం ఈ క్యూ3లో రూ.1,490 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. ప్రాజెక్ట్‌ల అమలు మెరుగుపడడం, దేశీయ ఆర్డర్లు అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎల్ అండ్ టీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్. శంకర్ రామన్ తెలిపారు. మొత్తం ఆదాయం 9% వృద్ధితో రూ.28,747 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ షేర్ 1 శాతం తగ్గి రూ.1,417 వద్ద ముగిసింది. -
2021 నాటికి 2 లక్షల కోట్ల ఆదాయం
లార్సెన్ అండ్ టూబ్రో చైర్మన్ నాయక్ ముంబై: ఇంజినీరింగ్, నిర్మాణ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్‌టీ) 2020-21 నాటికి రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. చైర్మన్ ఏఎం నాయక్ ఇక్కడ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే యేడాది పదవీ విరమణ చేయనున్న నాయక్ 71వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) సందర్భంగా షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కంపెనీతో నాలుగు దశాబ్దాల సంబంధం ఉన్న ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలను చూస్తే... ⇔ మార్జిన్లలో ఎటువంటి రాజీ లేకుండా ఆదాయ లక్ష్యాలను సాధించాలన్నది కంపెనీ లక్ష్యం. వార్షికంగా ఆర్డర్ బుక్‌ను రూ.2.5 లక్షల కోట్లకు అభివృద్ధి చేసుకోసుకోవడంపై కంపెనీ దృష్టి సారించింది. లక్ష్యాలను సాధించే విధంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊపందుకుంటుందని భావిస్తున్నా. ⇔ కంపెనీ భారీ వృద్ధికి సంబంధించి కొన్ని ప్రత్యేక రంగాలపై దృష్టి సారిస్తోంది. ఐటీ, టెక్నాలజీ సేవలు, రక్షణ, స్మార్ట్ వరల్డ్, వాటర్ మేనేజ్మెంట్ ఇందులో ఉన్నాయి. ⇔ డిజిటల్ విభాగంలో సాధించే ప్రగతి మున్ముందు కంపెనీకి లాభదాయకం కానుంది. ఇందులో గ్రూప్ కంపెనీలు ఎల్ అండ్‌టీ ఇన్ఫ్రా, ఎల్ అండ్ టీ టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తాయి. ⇔ వృద్ధి సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. మౌలిక రంగంపై కేంద్రం దృష్టి సారించడం కంపెనీకి లాభించే అంశం. అలాగే రక్షణ రంగంలో సంస్కరణలు రానున్న 10 సంవత్సరాల్లో కంపెనీకి 13 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. ఇక అణు ఇంధనానికి సంబంధించి కంపెనీకి మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసం ఉంది. ⇔ కాగా 2016 మార్చితో ముగిసిన కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,03,522 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 12 శాతం అధికం. కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రం 7 శాతం వృద్ధితో రూ.5,091 కోట్లకు పెరిగింది. -
ఖతర్ వరల్డ్ కప్ ప్రాజెక్టు.. ఎల్ అండ్ టీ పరం
న్యూఢిల్లీ : భారత ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ నిర్మాణ రంగంలో దూసుకెళ్తోంది. ఖతర్‌లో 135 మిలియన్ డాలర్ల వరల్డ్ కప్ స్టేడియం నిర్మాణ కాంట్రాక్టు, ఎల్ అండ్ టీని వరించినట్టు రాయిటర్స్ నివేదించింది. 40వేల సీటింగ్ సామర్థ్యంతో 'ఆలా రేయన్ స్టేడియం' నిర్మాణానికి ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపింది. 2022లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం ఎల్ అండ్ టీ ఈ నిర్మాణం చేపట్టనుందని పేర్కొంది. ఇప్పటికే గల్ఫ్ లో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ భాగస్వామ్యం అవుతోంది. మధ్యప్రాచ్య మార్కెట్లో నెమ్మదిస్తున్న వ్యాపారానికి కౌంటర్ గా ఆసియా, ఆఫ్రికాలో ప్రాజెక్టుల కోసం ఎల్ అండ్ టీ బిడ్డింగ్ వేస్తోందని కంపెనీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒకరు ఈ ఏడాది మేలో ప్రకటించారు. విదేశాల్లోనే కాక భారత్ లోనూ ఎల్ అండ్ టీ తన హవా కొనసాగిస్తోంది. వివిధ వ్యాపార విభాగాల్లో రూ.2,161 కోట్ల ఆర్డర్లను పొందినట్టు బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో ఎల్ అండ్ టీ పేర్కొంది. రవాణా మౌలిక సదుపాయాల వ్యాపారంలో రూ.847 కోట్ల డిజైన్, బిల్డ్ ఆర్డర్ ను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వరించినట్టు తన బీఎస్ఈ నివేదికలో తెలిపింది. నీటి సరఫరా వ్యాపారాల నుంచి రూ.709 కోట్ల ఆర్డరును గుజరాత్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాజస్తాన్ అర్బన్ డ్రింకింగ్ వాటర్ సెవరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి పొందినట్టు వెల్లడించింది. విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యాపారాల్లో రూ.403 కోట్ల ఆర్డరును పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కర్ణాటక సోలార్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి ఆర్జించినట్టు బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతేకాక లోహ పరిశోధన, మెటిరీయల్ హ్యాండ్లింగ్ వ్యాపారాల్లో కూడా రూ.202 కోట్ల ఆర్డరును పొందినట్టు తెలిపింది. -
ఫలితాలతో నిరాశ...
ఐదో రోజూ నష్టాల్లోనే మార్కెట్ * 181 పాయింట్ల నష్టంతో 26,657కు సెన్సెక్స్ * 46 పాయింట్ల నష్టంతో 8,066కు నిఫ్టీ ముంబై: ఐటీసీ, లార్సెన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈ రెండు కంపెనీల ఆర్థిక ఫలితాలతో భారత కంపెనీల ఆర్థిక స్థితిగతులపై తాజాగా ఆందోళనలు తెరమీదకు రావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 181 పాయింట్లు నష్టపోయి 26,657 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 8,066 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుతుండడం, బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం.. ఈ అంశాలు ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్, వాహన, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాలపాలయ్యాయి. వరుసగా ఐదో రోజూ స్టాక్ మార్కెట్‌కు నష్టాలొచ్చాయి. ఈ వారంలో సెన్సెక్స్814 పాయింట్లు(3 శాతం), నిఫ్టీ 230 పాయింట్ల (2.84 శాతం)చొప్పున నష్టపోయాయి. లాభాల నుంచి నష్టాల్లోకి... బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఒక దశలో 105 పాయింట్లు లాభపడింది. ఐటీసీ, ఎల్ అండ్ టీ నిరాశమయ ఫలితాలతో నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 181 పాయింట్ల నష్టంతో 26,657 పాయింట్ల వద్ద ముగిసింది. -
‘మెట్రో’ను దెబ్బతీసే యత్నం
ఎల్ అండ్ టీ మెట్రోరైల్ విభాగం ఎండీ వీబీ గాడ్గిల్ భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటాం దాన్ని పట్టుకొని కొన్ని పత్రికలు కావాలని అడ్డగోలుగా వార్తలు ప్రచురించాయి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన మెట్రోరైలు ప్రాజెక్టును దెబ్బతీయడానికే కొన్ని పత్రికలు అడ్డగోలుగా కథనాలను ప్రచురించాయని ఎల్ అండ్ టీ మెట్రోరైలు విభాగం ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టం చేశారు. మహానగరంలో ఇలాంటి భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏవో సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించుకోవడానికి వీలుగా లేఖలు రాయడం పెద్ద విషయమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. గాడ్గిల్ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు సమస్యలున్న నేపథ్యంలో.. మెట్రోను టేకోవర్ చేసుకోవాలంటూ గత ఫిబ్రవరిలోనే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించామని గుర్తుచేశారు. అలా తాము ప్రభుత్వానికి రాసిన లేఖల్లోంచి అక్కడక్కడా కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని పలు పత్రికలు ప్రచురించాయని.. సమస్య మొత్తాన్ని అర్థం చేసుకోలేదని వీబీ గాడ్గిల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులతో తాము మంచి సమన్వయంతో కలసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు కావాలనే పనిగట్టుకుని మెట్రోరైలు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. మెట్రోరైలు పనులు ఆలస్యమయ్యే అవకాశాలున్న పక్షంలో... వాటిని ఉన్నతస్థాయిలో పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామన్నారు. ఎన్నో సమస్యలున్నా.. దేశంలోనే అత్యంత వేగంగా మెట్రో రైలు పనులు జరుగుతున్నాయని.. మెట్రోపై వచ్చిన కథనాలపై తమ యాజమాన్యం కూడా అసంతృప్తితో ఉందని గాడ్గిల్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును గడువు కంటే ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం సహకరించకుండా.. సమస్యలు పరిష్కరించని పక్షంలో మరో ఆప్షన్ ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ.. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రయోజనకరమేనని గాడ్గిల్ వివరించారు. ప్రభుత్వానికి లేఖలు రాయడం నేరమేమీ కాదన్నారు. అలైన్మెంట్ మార్పు తెలియదు.. మెట్రో రైలు మార్గం అలైన్మెంట్ మార్పు గురించి తమకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లేఖ అందలేదని గాడ్గిల్ వివరించారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో మాత్రం పనులు ఆపేయాలని కోరిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తమకు పనిచేసుకోవడానికి రైట్ ఆఫ్ వే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ముందు నుంచి కోరుతున్నట్లు వివరించారు. -
అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా
న్యూఢిల్లీ: భారత అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. 2,100 కోట్ల డాలర్ల విలువతో తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్ ఈ ఏడాది కూడా నిలుపుకుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక వెల్లడించింది. భారత టాప్ 100 బ్రాండ్ల విలువ మొత్తం 9,260 కోట్ల డాలర్లని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం వెల్లడించిన మరికొన్ని వివరాలు... ఏడాదికాలంలో టాటా బ్రాండ్ విలువ 300 కోట్ల డాలర్లు పెరిగింది. టాటా గ్రూప్ అంతర్జాతీయ వివిధీకరణ వ్యూహం, గ్రూప్ ప్రధాన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. టాప్ 50 బ్రాండ్ల విలువ గత ఏడాది విలువతో పోల్చితే 10 శాతం పెరిగింది. టాటా, గోద్రేజ్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ ల బ్రాండ్ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రాండ్ విలువ 51 శాతం పెరిగింది. బలహీనమైన రుణ నియంత్రణ నిబంధనలు, నిర్వహణ తీరు సరిగ్గా లేనందున ప్రభుత్వ బ్యాంక్‌ల బ్రాండ్ విలువ తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ విలువ 190 కోట్ల డాలర్లు తగ్గింది. ఆదాయ అంచనాలు బాగా లేకపోవడం, మొండి బకాయిలు బ్రాండ్ విలువ తగ్గడంలో ప్రభావం చూపాయి. భారత అగ్రశ్రేణి 100 బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ విలువ, వ్యాపార విలువకు ఉన్న నిష్పత్తి సగటున 12%గా ఉంది. కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిష్పత్తి 3 శాతంగా ఉంది. -
ఊహలకు ‘ఊపిరి’!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత 4.25 కి.మీ. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ మార్గం నిర్మించేందుకు ఐదు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఎమ్మెమ్మార్డీయే ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. కాని వర్లీ-శివ్డీ ప్రాజెక్టు చేపట్టేందుకు పలు కంపెనీలు అసక్తి కనబర్చడంతో శివ్డీ-నవశేవ సీ లింక్ ప్రాజెక్టుకు కూడా త్వరలో మంచిరోజుల వస్తాయని అథారిటీ భావిస్తోంది. వర్లీ సీ ఫేస్వద్ద ఎక్కడైతే బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెన ముగుస్తుందో.. అక్కడి నుంచి ఈ ఎలివేటెడ్ మార్గం మొదలై ఎల్ఫిన్స్టన్ రోడ్ రైల్వే స్టేషన్, పరేల్, వడాల మీదుగా శివ్డీకి చేరుకుంటుంది. దీంతో బాంద్రా నుంచి వచ్చిన వాహనాలు నేరుగా ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా శివ్డీకి చేరుకుంటాయి. అక్కడి నుంచి నేరుగా సీ లింక్ మీదుగా నవశేవా చేరుకుంటాయి. వాహనదారులు ఇలా సులభంగా నగరం నుంచి బయటపడితే విలువైన సమయం, ఇంధనం ఆదా అవుతాయని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని అనుకున్నదొక్కటి జరిగింది మరొకటి అన్నట్లు శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు పనులకు ఏ కంపెనీ కూడా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుతోపాటు వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ ప్రాజెక్టు కూడా నీరుగారిపోవడం ఖాయమని అథారిటీ భావిస్తున్న తరుణంలో ఐదు కంపెనీలు ముందుకు రావడంతో ఎమ్మెమ్మార్డీయేలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.450 కోట్లు ఖర్చవుతాయని అంచనా. గెమన్ ఇండియా లి. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, లర్సన్ అండ్ టూబ్రో లి. ఎన్.సీ.సీ. లి., సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎలివేటెడ్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే ప్రతీ రోజు దాదాపు 20వేలకుపైగా వాహనాలు ఈ వంతెనను వినియోగిస్తాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్వినీ భిడే పేర్కొన్నారు. సదరు ఐదు కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించి, అర్హత ను బట్టి ఎంపికచేసిన కంపెనీకి ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రత్యక్షంగా పనులు ప్రారంభమైన తర్వాత నాలుగేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనలో ఉంది. ఇక్కడ స్థల సేకరణ పనులు ఇబ్బందికరంగా మారడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్, శివ్డీ-నవశేవా సీ లింక్ ఈ రెండు ప్రాజెక్టులు ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఒక ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఐదు కంపెనీలు ముందుకు రావడంతో, మిగిలిన పనులకు కూడా స్పందన వచ్చే అవకాశం ఉంటుందని అశ్వినీ భిడే ఆశాభావం వ్యక్తం చేశారు. -
2015 మార్చిలో పట్టాలపైకి ‘మెట్రో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు(8 కిలోమీటర్ల మేరకు) 2015, మార్చిలో ఉగాది కానుకగా పట్టాలెక్కి నగరవాసులకు అందుబాటులోకి రానుందని ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన హెచ్ఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫైనల్ క్యాంపెయిన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోరైలుకోసం ప్రతిపాదన వచ్చిందని, దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రెండో దశలో మరో ఎనిమిది రూట్లను గుర్తించామని, కేంద్రం గ్రీన్సిగ్నలిచ్చి నిధులు మంజూరుచేస్తే ఆయా రూట్లలోనూ మెట్రోరైలు పరుగెడుతుందని తెలిపారు. హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం మెట్రోరైలు పనులపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని, ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి ఎంతో అవసరమని చెప్పారు. మెట్రోరైల్ కోచ్ నమూనాను అక్టోబర్ 2న నగరవాసులకోసం ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించారు. దీనిని నెక్లెస్‌రోడ్‌లో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. దక్షిణకొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైలు బోగీలను తయారు చేస్తోంది. ఇప్పటికే 171 బోగీలకు ఆర్డరిచ్చినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.