వారానికి 90 గంటల పనిని సూచిస్తూ లార్సెన్ & టూబ్రో (L&T) చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై సర్వత్రా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన అందుకున్న జీతం (salary) వివరాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.
సుబ్రహ్మణ్యన్ జీతం
సుబ్రహ్మణ్యన్ 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో రూ. 51.05 కోట్లు ఆర్జించారు. ఇది ఎల్‌అండ్‌టీ ఉద్యోగుల సగటు జీతం రూ. 9.55 లక్షలు కంటే 534.57 రెట్లు అధికం. ఎల్‌అండ్‌టీ 2023-24 ఇంటిగ్రేటెడ్ వార్షిక నివేదిక ప్రకారం సుబ్రహ్మణ్యన్ అందుకున్న రూ.51.05 కోట్లలో వేతనం రూ 3.60 కోట్లు, అవసరాల కింద రూ 1.67 కోట్లు, పదవీ విరమణ ప్రయోజనాలు రూ. 10.50 కోట్లు, కమీషన్ రూ. 35.28 కోట్లు ఉన్నాయి. ఆయన మొత్తం వేతనం రూ. 51.05 కోట్లు గత సంవత్సరంతో పోలిస్తే 43.11% పెరిగింది.
ఆదివారం ఆఫీస్
కంపెనీ అమలు చేస్తున్న వారానికి ఆరు రోజుల పని విధానాన్ని సమర్థిస్తూ సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఉద్యోగులకు హితబోధ చేశారు.
"నేను మీతో ఆదివారాలు పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీరు ఆదివారాలూ పని చేస్తే నేను మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆదివారం పని చేస్తాను" అంటూ సుబ్రహ్మణ్యన్ మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు.. ఎంత సేపని భార్యను చూస్తూ ఉంటావు.. ఆఫీసుకు వచ్చి పని చేసుకో" అంటూ వివాదాస్పద వ్యాఖ్య కూడా సుబ్రహ్మణ్యన్ అందులో చేశారు. అమెరికన్లు వారానికి 50 గంటలు పనిచేస్తుండగా తాము వారానికి 90 గంటలు కష్టపడుతున్నామని ఓ చైనా వ్యక్తి తనతో చెప్పినట్లుగా ఆయన వివరించారు. దీన్ని ఉదాహరణగా తీసుకుని "మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే, వారానికి 90 గంటలు పని చేయాలి" అంటూ సెలవిచ్చారు.
ఈ వ్యాఖ్యలు విస్తృత విమర్శలను ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులతోపాటు కొందరు ప్రముఖులు సైతం సుబ్రహ్మణ్యన్‌పై విమర్శల దాడి చేశారు. నటి దీపికా పదుకొణె, బిలియనీర్ హర్ష్ గోయెంకా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల వంటి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
కొంతమంది వినియోగదారులు సుబ్రహ్మణ్యన్ సంపాదన, సగటు ఉద్యోగి జీతం మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. మరికొందరు వారానికి 70 గంటల పనిని సూచించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి, ఈయనకు సారుప్యతలను ముందుకు తెచ్చారు.
"నేను L&T అనే మంచి కంపెనీ అనున్నాను. అందరూ నారాయణ మూర్తి అడుగుజాడలనే అనుసరిస్తున్నారు" అంటూ ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "మనకు ఇలాంటి బిజినెస్ లీడర్లు ఉండటం దురదృష్టకరం" అని మరో యూజర్ కామెంట్ చేశారు. బయటి దేశాల్లో పనిచేసే ఉద్యోగులపై ఇటువంటి పని ఒత్తిడి ఉండదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment