2015 మార్చిలో పట్టాలపైకి ‘మెట్రో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు(8 కిలోమీటర్ల మేరకు) 2015, మార్చిలో ఉగాది కానుకగా పట్టాలెక్కి నగరవాసులకు అందుబాటులోకి రానుందని ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన హెచ్‌ఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫైనల్ క్యాంపెయిన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోరైలుకోసం ప్రతిపాదన వచ్చిందని, దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
రెండో దశలో మరో ఎనిమిది రూట్లను గుర్తించామని, కేంద్రం గ్రీన్‌సిగ్నలిచ్చి నిధులు మంజూరుచేస్తే ఆయా రూట్లలోనూ మెట్రోరైలు పరుగెడుతుందని తెలిపారు. హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం మెట్రోరైలు పనులపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని, ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి ఎంతో అవసరమని చెప్పారు. మెట్రోరైల్ కోచ్ నమూనాను అక్టోబర్ 2న నగరవాసులకోసం ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించారు. దీనిని నెక్లెస్‌రోడ్‌లో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. దక్షిణకొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైలు బోగీలను తయారు చేస్తోంది. ఇప్పటికే 171 బోగీలకు ఆర్డరిచ్చినట్టు ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.