
సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 16 నుంచి(సోమవారం) మెట్రో రైలు పని వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ నూతన సమయపట్టిక ప్రకటించింది. ఎల్బీనగర్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న రైళ్ల పనివేళలు స్వల్పంగా మారనున్నాయి. ఇకపై సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తొలిరైలు 6.30 గంటలకు బయలుదేరనుంది.
ఇక ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు మొదలయ్యే తొలి రైలు ఉదయం 7గంటలకు బయలుదేరనుంది. ట్రయల్‌రన్ నేపథ్యంలో మెట్రో రైళ్ల పనివేళలను అరగంటపాటు కుదించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా రాత్రి 10 గంటల వరకు యథావిధిగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. కాగా ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఆగస్టు తొలివారంలో, అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో ఈ ఏడాది అక్టోబరులో మెట్రో రైళ్లు సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎంఆర్ ఏర్పాట్లు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే నిత్యం 75 వేల మంది ప్రయాణికులు నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు.