మెట్రోలో నరసింహన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, భార్యతో కలసి అతి సామాన్యుల్లా మెట్రో రైలులో ప్రయాణించి సర్‌ప్రైజ్ చేశారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన నరసింహన్ దంపతులు మెట్రో రైలు ఎక్కి అమీర్‌పేట్ జంక్షన్‌లో దిగారు.
అక్కడినుంచి మియాపూర్‌కు కనెక్టింగ్ ట్రైన్‌లో బయల్దేరారు.
కూకట్‌పల్లిలో అప్పటికే ఇన్‌స్పెక్షన్ చేస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డికి సమాచారం చేరడంతో ఆయన హుటాహుటిని మియాపూర్‌కు చేరుకుని గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అయితే, గవర్నర్ ఆయన స్వాగతాన్ని తొలుత నిరాకరించారు.
అయినప్పటికీ పట్టువదలని ఎన్‌వీఎస్ రెడ్డి మియాపూర్ జంక్షన్‌లోని సౌకర్యాలను చూపుతానని కోరారు. దీంతో సాధారణ ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూపాలని నరసింహన్ కండీషన్ పెట్టారు. ఇందుకు అంగీకరించిన రెడ్డి.. నరసింహన్ దంపతులకు వసతులను చూపారు.
మెట్రో సదుపాయాలపై గవర్నర్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డిలతో పాటు స్టాఫ్‌ను అభినందించారు. మాస్కోలోని మెట్రో తరహాలో ఆర్ట్ మ్యూజియంలను కూడా మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment