HMRL MD NVS Reddy
-
హైదరాబాద్ మెట్రోతో ఎన్ని కోట్ల లీటర్ల ఫ్యూయల్ ఆదా అయ్యిందో తెలుసా?
భాగ్యనగర వాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమై నాలుగేళ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) సాధించిన ఘనతలను హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాలుగేళ్లలో తొలి దశలో నాగోల్ - అమీర్‌పేట - మియాపూర్ సెక్షన్లలో 30 కిలోమీటర్ల నిడివితో 2017 నవంబరు 29న మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. నాలుగు నెలల పాటు 15 నిమిషాలకు ఒక రైలు వంతున నడిపాం. ఆ తర్వాత క్రమంగా రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ 5 నిమిషాలకు ఒక రైలు పీక్ అవర్స్‌లో 3 నిమిషాలకే ఒక రైలు వరకు తెచ్చాం. కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత పీక్ అవర్ ఫ్రీక్వెన్సీని 4.30 నిమిషాలుగా ఉంది. మెట్రో రైళ్లు 99 శాతం సమయ పాలనతో నడుస్తున్నాయి. 20 కోట్ల మంది మెట్రో రైలు సర్వీసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 20.80 కోట్ల మంది రైడర్లు ఇందులో ప్రయాణం చేశారు. మెట్రో రైళ్లు సుమారుగా 1.9 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాయి. ఇదే ప్రయాణం పెట్రోలు, డీజిల్ ఇంజన్ల ద్వారా చేయాల్సి వస్తే 4.70 కోట్ల లీటర్ల ఫ్యూయల్ ఖర్చు అయ్యేది. పర్యావరణం ఈ నాలుగేళ్లలో 110 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ వాతావరణంలో కలవకుండా మెట్రో అడ్డుకుంది. అంతేకాదు మెట్రో ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న సోలార్ సిస్టమ్ కారణంగా మరో 14 మిలియన్ కిలోల కార్బన్ డై యాక్సైడ్ అరికట్టగలిగారు. చదవండి: ఢిల్లీ తరహాలో ఎయిర్పోర్ట్ వరకు హైదరాబాద్ ‘మెట్రో’ -
మెట్రో రైలులో ఊడిపడిన సీలింగ్!
సాక్షి, హైదరాబాద్ : అత్యంత రద్దీగా ఉన్న ఓ మెట్రోరైలు బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్) ఊడిపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో పలువురు పైకప్పునకు ఉన్న హ్యాండిల్‌ను పట్టుకొని నిలుచున్నారు. పరిమితికి మించి జనం దాన్ని పట్టుకోవడంతో కొంత భాగం ఊడి తమపై పడినట్లు కొందరు తెలిపారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో రైలును కొద్దిసేపు నిలిపినట్లు సమాచారం.అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. బోగీలోపలి భాగాలు అత్యంత తేలికైన ఫైబర్‌తో తయారు చేసినవి కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుస్తోంది. దీనిపై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డిని వివరణ కోరగా..మెట్రో బోగీలో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. -
మెట్రోకు వరద బురద
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానొస్తే రోడ్లు చెరువులవుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై చేరిన నీటితో వాహనాలు, ప్రజలు ముందుకు కదలలేక పడరాని పాట్లు పడుతున్నారు. తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో అల్లాడుతున్నారు. అడ్డదిడ్డంగా వెలసిన బహుళ నిర్మాణాలు, అనుమతి లేని కట్టడాలు, మెకానిక్షెడ్లు, హోటళ్లు, తదితర సంస్థలు రోడ్లపైకే వాననీరు వదులుతుండటంతో నీరంతా రోడ్లపైనే చేరుతోంది. అధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పార్కుల వ్యర్థాలు, ఇసుకవంటివి నాలాల్లో చేరి వరద నీరుసాఫీగా ప్రయాణించడం లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే నాలాలు పొంగిపొర్లుతూ వరదనీరు రోడ్లపైకే చేరుతోంది.. వీటితోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) సైతం మెట్రోస్టేషన్ల వద్ద వరదనీరు పోయేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా స్టేషన్లలో వర్షపునీరు రోడ్లపైకే చేరుతోంది. అక్కడే నిల్వ ఉంటోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు చెరువులుగా మారడానికి, ట్రాఫిక్ చిక్కులు ఏర్పడటానికి పలు అంశాల్ని గుర్తించారు. వాళ్లు గుర్తించిన అంశాల్లో మెట్రోస్టేషన్ల వద్ద నీటి నిల్వలుండటం కూడా ప్రముఖంగా ఉంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించిన మూడు మెట్రోస్టేషన్లు ఎర్రగడ్డ, మూసాపేట, బాలానగర్‌లలో వర్షపునీరు సాఫీగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు లేవు. రోడ్డుకు మధ్యలో ఎత్తయిన సెంట్రల్ మీడియన్, రోడ్డు పక్కల ఫుట్‌పాత్‌లున్నాయి. ఫుట్‌పాత్‌లకు అవతల ఉన్న వరదకాలువల్లోకి వాననీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఫుట్‌పాత్‌ల నుంచి వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులు చిన్నవి కావడంతో పెద్ద వర్షం కురిసినప్పుడు అవి సరిపోవడం లేవు. దాంతో ఎక్కువ నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. మూసాపేటలో పేవర్‌బ్లాక్ ఎక్కువ ఎత్తుగా ఉండటంతో రోడ్డుపై నీరు నిల్వ ఉంటోంది. బాలానగర్ స్టేషన్ దగ్గర డి మార్ట్ వద్ద కేవలం ఒక అడుగు వెడల్పు డ్రైయిన్ మాత్రమే ఉండటంతో వర్షపునీరు మొత్తం వెళ్లేందుకు అది సరిపోవడం లేదు. మెట్రోస్టేషన్ల వద్ద పైకప్పుల నుంచి కూడా నీరు రోడ్లపైకే చేరుతోంది. పైనుంచి వర్షపు నీరు వరదకాలువల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు లేవు. అధికారులు తనిఖీలు నిర్వహించిన మూడు మెట్రోస్టేషన్ల వద్ద ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. మిగతా స్టేషన్టలో ఎలాంటి సమస్యలున్నాయో గుర్తించాల్సిందిగా కూడా ఉన్నతాధికారులు ఇంజినీర్లను ఆదేశించినట్లు తెలిసింది. నగరంలోని అన్ని మెట్రోస్టేషన్ల వద్ద కూడా దాదాపుగా ఇవే పరిస్థితులున్నాయని ఇంజినీరింగ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. నర్సాపూర్ క్రాస్‌రోడ్ వద్ద కూడా.. బాలానగర్‌లో నర్సాపూర్ క్రాస్‌రోడ్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కూడా నీటినిల్వలు ఏర్పడుతున్నాయని గుర్తించారు.అక్కడ నీరు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ సంబంధిత హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) అధికారులకు కూడా లేఖ రాస్తున్నారు. పెనాల్టీలు విధిస్తారా..? రోడ్లపై నీరు చేరుతూ రోడ్లు త్వరితంగా దెబ్బతినేందుకు కారణమైన వారికి పెనాల్టీలు విధిస్తామని గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ హెచ్చరించారు. ప్రైవేట్ సంస్థలకే కాకుండా ఈ అంశంలో జలమండలి పొరపాటుంటే దానికి సైతం జరిమానా విధిస్తామని ప్రకటించారు. వర్షాలతో రోడ్లపైనీరు చేరుతూ త్వరితంగా రోడ్లు పాడయ్యేందుకు కారణమవుతున్న హైదరాబాద్ మెట్రో రైల్లిమిటెడ్కు జరిమానా విధిస్తారా.. లేదా..? అన్నది ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. సింహభాగం రోడ్లకే.. జీహెచ్ఎంసీ ఏటా ఖర్చు చేస్తున్న నిధుల్లో సింహభాగం రోడ్లకే వెచ్చిస్తున్నారు. బీటీ రీకార్పెటింగ్, ప్యాచ్‌వర్క్ పనులు, పాట్‌హోల్ ఫిల్లింగ్స్కు సైతం ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయి. ఎన్నినిధులు ఖర్చు చేసినా ఇలా వర్షపునీటితో చేసిన పనులు కొట్టుకుపోతుండటంతో జీహెచ్ఎంసీ నిజంగానే పెనాల్టీ విధిస్తుందా ?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మా మంచి మెట్రో!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలుగా ప్రసిద్ధి చెందిన లండన్, మెల్బోర్న్, మాంచెస్టర్, బోస్టన్ తదితర మహానగరాల కంటే మెరుగైన మెట్రో సేవలందిస్తూ ప్రయాణికులను సంతృప్తి పరుస్తోందని తేలింది. ప్రయాణికుల సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98 శాతం మెరుగైన స్కోరు సాధించి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నట్లు మెట్రో ప్రాజెక్టు నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. కియోలిస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో వివిధ రకాల ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. ఇందులో లండన్ ఆటోమెటిక్ మెట్రో, మెల్బోర్న్ ట్రామ్వే, బోస్టన్ కమ్యూటర్ ట్రెయిన్, స్టాక్‌హోమ్ సిటీ బసెస్, లయాన్ మెట్రో అండ్ బస్ సర్వీసెస్, మాంచెస్టర్ ట్రామ్వే తదితర ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగరంలో మూడు మార్గాల్లో పరుగులు తీయనున్న 57 మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ, టికెటింగ్, టికెట్ల విక్రయాలు, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థల నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును కియోలిస్ సంస్థ 2012లో దక్కించుకున్న విషయం విదితమే. సర్వే సాగిందిలా.. ఈ సర్వేలో ప్రధానంగా మెట్రో సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారా.. మెట్రో సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఎలా ఫీలవుతున్నారు.. ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో సరైన సమాచారం అందుతుందా.. సిబ్బంది వారికి సహకరిస్తున్నారా.. మెట్రో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు భావిస్తున్నారా.. తాము చెల్లించిన డబ్బుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నామని ప్రయాణికులు అనుకుంటున్నారా.. తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది అభిప్రాయాలను కియోలిస్ సంస్థ పరిశీలించింది. ఈ ఏడాది 25 జూన్ నుంచి– జూలై 11 మధ్య కాలంలో సేకరించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఎల్బీనగర్– మియాపూర్ 1.14 లక్షల మంది.. ఎల్బీనగర్– మియాపూర్ మార్గం (29 కి.మీ)లో మంగళవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో ప్రయాణం చేశారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకు మెట్రో రైళ్లు నిండుగా రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎల్బీనగర్– అమీర్‌పేట్ మార్గంలో ఏకంగా 69 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. ఇక మియాపూర్– అమీర్‌పేట్ మార్గంలో 45 వేల మంది రాకపోకలు సాగించారన్నారు. నిత్యం ఈ మార్గంలో సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పా రు. ఇక మంగళవారం నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో 51 వేల మంది మెట్రో ప్రయాణం చేశారని తెలిపారు. -
సర్ప్రైజ్ విజిట్ : మెట్రోలో గవర్నర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, భార్యతో కలసి అతి సామాన్యుల్లా మెట్రో రైలులో ప్రయాణించి సర్ప్రైజ్ చేశారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన నరసింహన్ దంపతులు మెట్రో రైలు ఎక్కి అమీర్‌పేట్ జంక్షన్లో దిగారు. అక్కడినుంచి మియాపూర్‌కు కనెక్టింగ్ ట్రైన్లో బయల్దేరారు. కూకట్‌పల్లిలో అప్పటికే ఇన్స్పెక్షన్ చేస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సమాచారం చేరడంతో ఆయన హుటాహుటిని మియాపూర్‌కు చేరుకుని గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అయితే, గవర్నర్ ఆయన స్వాగతాన్ని తొలుత నిరాకరించారు. అయినప్పటికీ పట్టువదలని ఎన్వీఎస్ రెడ్డి మియాపూర్ జంక్షన్‌లోని సౌకర్యాలను చూపుతానని కోరారు. దీంతో సాధారణ ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూపాలని నరసింహన్ కండీషన్ పెట్టారు. ఇందుకు అంగీకరించిన రెడ్డి.. నరసింహన్ దంపతులకు వసతులను చూపారు. మెట్రో సదుపాయాలపై గవర్నర్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో పాటు స్టాఫ్‌ను అభినందించారు. మాస్కోలోని మెట్రో తరహాలో ఆర్ట్ మ్యూజియంలను కూడా మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. -
జూన్‌లో మెట్రో పరుగులు తీస్తుందా?
హైదరాబాద్ : ఈ ఏడాది కూడా నగరవాసులకు నిరాశే. ఎన్నోరోజులుగా ఊరిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ ఏడాది కూడా పట్టాలు ఎక్కేలా కనిపించడం లేదు. పండుగలు వచ్చి వెళుతున్నాయి కానీ మెట్రో రైలు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. దసరా, దీపావళి అంటు వచ్చే ప్రతి పండగకు ముందు మెట్రోరైల్ ప్రారంభిస్తామని లీకులిచ్చిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ...సర్వీసులను ఎప్పుడు ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అంతేకాకుండా మొదట నాగోలు -మెట్టుగూడల మధ్య రైలును ప్రారంభిస్తామని చెప్పిన హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, తాజాగా మియాపూర్-ఎస్ఆర్ నగర్ మార్గం వైపు దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. కాగా జూన్‌లో మియాపూర్–ఎస్ఆర్ నగర్(11 కి.మీ) మార్గంలో మెట్రో పరుగులు పెట్టనుందని ఎన్వీఎస్రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఎల్అండ్టీ రూ.12,000 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం రూ.2,100 ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాదిచివరికల్లా మెట్రో రైలు ప్రారంభం అవుతుందని, అయితే మెట్రో ప్రారంభ తేదీ, ముహూర్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్య లేదని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. 17 చోట్ల ఎల్అండ్టీ మల్టి లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాదికే మెట్రో పనులు పూర్తి కావాల్సి ఉన్నా, పార్కింగ్, అలైన్మెంట్లో మార్పులు, స్థల సేకరణతో పాటు ఇతర అంశాల కారణంగా జాప్యం జరిగిందని, 2018 డిసెంబర్ కల్లా మెట్రో పనులు పూర్తి అవుతాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కాగా మెట్రో రైల్ సర్వీసులపై కేంద్రం స్పష్టతనిస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. అలాగే పాతబస్తీలో మెట్రో పనులపై ఎలాంటి స్పష్టత లేదని హెచ్ఎంఆర్ఎల్ చెపుతోంది.