సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానొస్తే రోడ్లు చెరువులవుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై చేరిన నీటితో వాహనాలు, ప్రజలు ముందుకు కదలలేక పడరాని పాట్లు పడుతున్నారు. తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో అల్లాడుతున్నారు. అడ్డదిడ్డంగా వెలసిన బహుళ నిర్మాణాలు, అనుమతి లేని కట్టడాలు, మెకానిక్‌షెడ్లు, హోటళ్లు, తదితర సంస్థలు రోడ్లపైకే వాననీరు వదులుతుండటంతో నీరంతా రోడ్లపైనే చేరుతోంది. అధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పార్కుల వ్యర్థాలు, ఇసుకవంటివి నాలాల్లో చేరి వరద నీరుసాఫీగా ప్రయాణించడం లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే నాలాలు పొంగిపొర్లుతూ వరదనీరు రోడ్లపైకే చేరుతోంది.. వీటితోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) సైతం మెట్రోస్టేషన్ల వద్ద వరదనీరు పోయేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా స్టేషన్లలో వర్షపునీరు రోడ్లపైకే చేరుతోంది. అక్కడే నిల్వ ఉంటోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లు చెరువులుగా మారడానికి, ట్రాఫిక్ చిక్కులు ఏర్పడటానికి పలు అంశాల్ని గుర్తించారు. వాళ్లు గుర్తించిన అంశాల్లో మెట్రోస్టేషన్ల వద్ద నీటి నిల్వలుండటం కూడా ప్రముఖంగా ఉంది.
జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించిన మూడు మెట్రోస్టేషన్లు ఎర్రగడ్డ, మూసాపేట, బాలానగర్‌లలో వర్షపునీరు సాఫీగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు లేవు. రోడ్డుకు మధ్యలో ఎత్తయిన సెంట్రల్ మీడియన్, రోడ్డు పక్కల ఫుట్‌పాత్‌లున్నాయి. ఫుట్‌పాత్‌లకు అవతల ఉన్న వరదకాలువల్లోకి వాననీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఫుట్‌పాత్‌ల నుంచి వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులు చిన్నవి కావడంతో పెద్ద వర్షం కురిసినప్పుడు అవి సరిపోవడం లేవు. దాంతో ఎక్కువ నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. మూసాపేటలో పేవర్‌బ్లాక్ ఎక్కువ ఎత్తుగా ఉండటంతో రోడ్డుపై నీరు నిల్వ ఉంటోంది. బాలానగర్ స్టేషన్ దగ్గర డి మార్ట్ వద్ద కేవలం ఒక అడుగు వెడల్పు డ్రైయిన్ మాత్రమే ఉండటంతో వర్షపునీరు మొత్తం వెళ్లేందుకు అది సరిపోవడం లేదు. మెట్రోస్టేషన్ల వద్ద పైకప్పుల నుంచి కూడా నీరు రోడ్లపైకే చేరుతోంది. పైనుంచి వర్షపు నీరు వరదకాలువల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు లేవు. అధికారులు తనిఖీలు నిర్వహించిన మూడు మెట్రోస్టేషన్ల వద్ద ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. మిగతా స్టేషన్టలో ఎలాంటి సమస్యలున్నాయో గుర్తించాల్సిందిగా కూడా ఉన్నతాధికారులు ఇంజినీర్లను ఆదేశించినట్లు తెలిసింది. నగరంలోని అన్ని మెట్రోస్టేషన్ల వద్ద కూడా దాదాపుగా ఇవే పరిస్థితులున్నాయని ఇంజినీరింగ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
నర్సాపూర్ క్రాస్‌రోడ్ వద్ద కూడా..
బాలానగర్‌లో నర్సాపూర్ క్రాస్‌రోడ్ వద్ద హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కూడా నీటినిల్వలు ఏర్పడుతున్నాయని గుర్తించారు.అక్కడ నీరు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ సంబంధిత హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్‌డీసీఎల్) అధికారులకు కూడా లేఖ రాస్తున్నారు.
పెనాల్టీలు విధిస్తారా..?
రోడ్లపై నీరు చేరుతూ రోడ్లు త్వరితంగా దెబ్బతినేందుకు కారణమైన వారికి పెనాల్టీలు విధిస్తామని గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ హెచ్చరించారు. ప్రైవేట్ సంస్థలకే కాకుండా ఈ అంశంలో జలమండలి పొరపాటుంటే దానికి సైతం జరిమానా విధిస్తామని ప్రకటించారు. వర్షాలతో రోడ్లపైనీరు చేరుతూ త్వరితంగా రోడ్లు పాడయ్యేందుకు కారణమవుతున్న హైదరాబాద్ మెట్రో రైల్‌లిమిటెడ్‌కు జరిమానా విధిస్తారా.. లేదా..? అన్నది ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికరంగా మారింది.
సింహభాగం రోడ్లకే..
జీహెచ్‌ఎంసీ ఏటా ఖర్చు చేస్తున్న నిధుల్లో సింహభాగం రోడ్లకే వెచ్చిస్తున్నారు. బీటీ రీకార్పెటింగ్, ప్యాచ్‌వర్క్ పనులు, పాట్‌హోల్ ఫిల్లింగ్స్‌కు సైతం ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయి. ఎన్నినిధులు ఖర్చు చేసినా ఇలా వర్షపునీటితో చేసిన పనులు కొట్టుకుపోతుండటంతో జీహెచ్‌ఎంసీ నిజంగానే పెనాల్టీ విధిస్తుందా ?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment