సాక్షి, హైదరాబాద్: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది. కార్లలో మెయిన్ రోడ్లమీదే తిరుగుతాం. గల్లీల్లో, బస్తీల్లో ప్రజల బాధలు తెలియాలంటే మోటార్‌సైకిళ్లపై వెళ్లండి. క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల ఎన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.. ఎక్కడ ఎన్ని గుంతలు పడ్డాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది క్లియర్‌గా తెలుస్తుంది’ అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు.
తగిన చర్యలు తీసుకోవాలి: మేయర్
నగరంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి ఇబ్బందులు, తదితర సమస్యలు తెలుసుకునేందుకు జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు క్షేతస్థ్రాయిలో మోటార్ సైకిళ్లపై పర్యటించాలని ఆమె ఆదేశించారు. రోడ్లపై గుంతలు తదితరమైన వాటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడంతోపాటు సదరు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణచర్యలు చేపట్టాలన్నారు.
వరద ప్రభావ ప్రాంతాల్లో అందుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు బుధవారం మేయర్ అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేశారు. పేరుకుపోయిన చెత్తకుప్పలను వెంటనే తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. విరిగిన చెట్లను, వీధిదీపాలకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. అనంతరం తన చాంబర్‌లో జోనల్ కమిషనర్లతో వర్షబాధితులకు పునరావాస కార్యక్రమాలతోపాటు వినాయకచివితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
మండపాల వద్ద చెత్తకుండీలు
వినాయక మండపాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కమిటీ సభ్యులకు తగిన సహకారం అందజేయాలని, ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ (శానిటేషన్) బి.సంతోష్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment