ఖతర్ వరల్డ్ కప్ ప్రాజెక్టు.. ఎల్ అండ్ టీ పరం
ఖతర్ వరల్డ్ కప్ ప్రాజెక్టు.. ఎల్ అండ్ టీ పరం
Published Mon, Jun 6 2016 4:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
న్యూఢిల్లీ : భారత ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ నిర్మాణ రంగంలో దూసుకెళ్తోంది. ఖతర్‌లో 135 మిలియన్ డాలర్ల వరల్డ్ కప్ స్టేడియం నిర్మాణ కాంట్రాక్టు, ఎల్ అండ్ టీని వరించినట్టు రాయిటర్స్ నివేదించింది. 40వేల సీటింగ్ సామర్థ్యంతో 'ఆలా రేయన్ స్టేడియం' నిర్మాణానికి ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపింది. 2022లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం ఎల్ అండ్ టీ ఈ నిర్మాణం చేపట్టనుందని పేర్కొంది. ఇప్పటికే గల్ఫ్ లో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ భాగస్వామ్యం అవుతోంది. మధ్యప్రాచ్య మార్కెట్లో నెమ్మదిస్తున్న వ్యాపారానికి కౌంటర్ గా ఆసియా, ఆఫ్రికాలో ప్రాజెక్టుల కోసం ఎల్ అండ్ టీ బిడ్డింగ్ వేస్తోందని కంపెనీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒకరు ఈ ఏడాది మేలో ప్రకటించారు.
విదేశాల్లోనే కాక భారత్ లోనూ ఎల్ అండ్ టీ తన హవా కొనసాగిస్తోంది. వివిధ వ్యాపార విభాగాల్లో రూ.2,161 కోట్ల ఆర్డర్లను పొందినట్టు బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో ఎల్ అండ్ టీ పేర్కొంది. రవాణా మౌలిక సదుపాయాల వ్యాపారంలో రూ.847 కోట్ల డిజైన్, బిల్డ్ ఆర్డర్ ను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వరించినట్టు తన బీఎస్ఈ నివేదికలో తెలిపింది. నీటి సరఫరా వ్యాపారాల నుంచి రూ.709 కోట్ల ఆర్డరును గుజరాత్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రాజస్తాన్ అర్బన్ డ్రింకింగ్ వాటర్ సెవరేజ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి పొందినట్టు వెల్లడించింది. విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యాపారాల్లో రూ.403 కోట్ల ఆర్డరును పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కర్ణాటక సోలార్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి ఆర్జించినట్టు బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతేకాక లోహ పరిశోధన, మెటిరీయల్ హ్యాండ్లింగ్ వ్యాపారాల్లో కూడా రూ.202 కోట్ల ఆర్డరును పొందినట్టు తెలిపింది.
Advertisement
Advertisement