Qatar World Cup Stadium
-
అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ?
మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో లిక్కర్(మద్యం) ఏరులై పారుతుంది. మ్యాచ్‌కు వచ్చే అభిమానులు బీర్లు తాగుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. అవి శ్రుతిమించిన సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ అలా చేస్తేనే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఫుల్ కిక్కుగా ఉంటాయి. ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం శుక్రవారం మద్యం ప్రియులకు చేదువార్త చెప్పారు అక్కడి నిర్వాహకులు. మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల్లో బీర్లు అమ్మడం నిషేధమని ఖతార్ దేశ ప్రభుత్వం పేర్కొంది. కావాలంటే స్టేడియాలకు దూరంగా బయట బీర్లను అమ్ముకోవచ్చు అని తమ ప్రకటనలో తెలిపింది. ఇది కఠినంగా అమలు చేయాలని స్టేడియం సిబ్బందిని ఆదేశించింది. కానీ ఫుల్బాల్ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు పొందే సమయంలో ఫిఫా వాణిజ్య ఒప్పందాలను గౌరవిస్తామని ఖతార్ అంగీకరించింది. ఆతిథ్య హక్కులు పొందే సమయంలో అన్ని వాణిజ్య ఒప్పందాలను అంగీకరిస్తామని చెప్పి.. ఇప్పుడిలా చేయడం ఏంటని ఫిఫా నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖతార్ ఒక ఇస్లామిక్ దేశం. అసలు బహిరంగంగా మద్యం తాగడం అక్కడ పూర్తిగా నిషేధం. అయితే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ కావడంతో ఖతార్ కూడా కొన్ని నిబంధనలను సవరించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధం అలాగే ఉన్నా.. మ్యాచ్‌లకు వచ్చే అభిమానులు స్టేడియాల్లో బీర్లను తాగేందుకు అనుమతించింది. కానీ స్టేడియంలో బీర్ల అమ్మకాలు జరపొద్దని మాత్రం స్పష్టంగా చెప్పింది. ఒకసారి ఆతిథ్య హక్కుల పొందాకా ఫిఫా కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. ఖతార్ దేశ నియమాలను ఎవరైనా ఆచరించాల్సిందే అన్న విషయం మరోసారి అవగతమైంది. ఇక బీర్లు తయారు చేసే సంస్థ అయిన బడ్వైజర్తో(Budwizer Brand) ఫిఫాకు ఎన్నో ఏళ్లుగా ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా వరల్డ్‌కప్ సమయంలో స్టేడియాల దగ్గర బడ్వైజర్ బీర్లు అమ్ముతుంటారు.స్టేడియాల్లోనే ఫ్యాన్స్ బీర్లు తాగుతూ మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అన్ని స్టేడియాల నుంచి బీర్లను నిషేధించే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే 8 స్టేడియాల దగ్గర బడ్వైజర్ స్టాండ్స్ ఉన్నాయి. అయితే వీటిని స్టేడియాలకు దూరంగా తరలించాలని ఖతార్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక 2009లోనే ఖతార్ ఈ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులను పొందింది. ఆల్కహాల్ పాలసీ ప్రకారం.. కార్పొరేట్ క్లైంట్లకు మాత్రమే స్టేడియాల్లోని రెస్టారెంట్లు, లాంజ్లలోనే షాంపేన్, వైన్స్, స్పిరిట్స్ ఇస్తారు. ఇక హైఎండ్ హోటల్స్, క్రూయిజ్ షిప్స్‌లలో ఉండే ఫ్యాన్స్ కూడా వివిధ రకాలైన ఆల్కహాల్ డ్రింక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఖతార్‌లో బహిరంగంగా మద్యం తాగితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. అయితే వరల్డ్ కప్ జరిగే సమయాల్లో మాత్రం ఇలాంటివి చూసీ చూడనట్లు ఉంటామని ఖతార్ సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ ఇప్పటికే ప్రకటించారు. తాగి గొడవలకు దిగితే మాత్రం అరెస్టులు తప్పవని హెచ్చరించారు. ఇక మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకోవద్దని.. బాడీ పార్ట్స్ కనిపించేలా దుస్తులు ధరిస్తే జైలుకు పంపిస్తామని గురువారం ప్రకటించారు. తాజాగా బీర్ల అమ్మకాలపై కూడా నిషేధం విధించడం అభిమానులకు మింగుడు పడని విషయం. ''అందం చూడొద్దన్నారు.. ఇప్పుడు మందును కూడా దూరం చేశారు.. ఏంటి మాకు ఈ పరిస్థితి'' అంటూ అభిమానులు గోల చేస్తున్నారు. చదవండి: ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్‌కు అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
ఖతర్ వరల్డ్ కప్ ప్రాజెక్టు.. ఎల్ అండ్ టీ పరం
న్యూఢిల్లీ : భారత ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ నిర్మాణ రంగంలో దూసుకెళ్తోంది. ఖతర్‌లో 135 మిలియన్ డాలర్ల వరల్డ్ కప్ స్టేడియం నిర్మాణ కాంట్రాక్టు, ఎల్ అండ్ టీని వరించినట్టు రాయిటర్స్ నివేదించింది. 40వేల సీటింగ్ సామర్థ్యంతో 'ఆలా రేయన్ స్టేడియం' నిర్మాణానికి ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపింది. 2022లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం ఎల్ అండ్ టీ ఈ నిర్మాణం చేపట్టనుందని పేర్కొంది. ఇప్పటికే గల్ఫ్ లో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ భాగస్వామ్యం అవుతోంది. మధ్యప్రాచ్య మార్కెట్లో నెమ్మదిస్తున్న వ్యాపారానికి కౌంటర్ గా ఆసియా, ఆఫ్రికాలో ప్రాజెక్టుల కోసం ఎల్ అండ్ టీ బిడ్డింగ్ వేస్తోందని కంపెనీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒకరు ఈ ఏడాది మేలో ప్రకటించారు. విదేశాల్లోనే కాక భారత్ లోనూ ఎల్ అండ్ టీ తన హవా కొనసాగిస్తోంది. వివిధ వ్యాపార విభాగాల్లో రూ.2,161 కోట్ల ఆర్డర్లను పొందినట్టు బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో ఎల్ అండ్ టీ పేర్కొంది. రవాణా మౌలిక సదుపాయాల వ్యాపారంలో రూ.847 కోట్ల డిజైన్, బిల్డ్ ఆర్డర్ ను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వరించినట్టు తన బీఎస్ఈ నివేదికలో తెలిపింది. నీటి సరఫరా వ్యాపారాల నుంచి రూ.709 కోట్ల ఆర్డరును గుజరాత్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాజస్తాన్ అర్బన్ డ్రింకింగ్ వాటర్ సెవరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి పొందినట్టు వెల్లడించింది. విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యాపారాల్లో రూ.403 కోట్ల ఆర్డరును పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కర్ణాటక సోలార్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి ఆర్జించినట్టు బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతేకాక లోహ పరిశోధన, మెటిరీయల్ హ్యాండ్లింగ్ వ్యాపారాల్లో కూడా రూ.202 కోట్ల ఆర్డరును పొందినట్టు తెలిపింది.