‘మెట్రో’ను దెబ్బతీసే యత్నం | Will complete Hyderabad metro as per schedule: L&T | Sakshi
Sakshi News home page

‘మెట్రో’ను దెబ్బతీసే యత్నం

Published Thu, Sep 18 2014 1:53 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

‘మెట్రో’ను దెబ్బతీసే యత్నం - Sakshi

‘మెట్రో’ను దెబ్బతీసే యత్నం

  •  ఎల్ అండ్ టీ మెట్రోరైల్ విభాగం ఎండీ వీబీ గాడ్గిల్
  •   భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి..
  •   వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటాం
  •   దాన్ని పట్టుకొని కొన్ని పత్రికలు కావాలని అడ్డగోలుగా వార్తలు ప్రచురించాయి
  • సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన మెట్రోరైలు ప్రాజెక్టును దెబ్బతీయడానికే కొన్ని పత్రికలు అడ్డగోలుగా కథనాలను ప్రచురించాయని ఎల్ అండ్ టీ మెట్రోరైలు విభాగం ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టం చేశారు. మహానగరంలో ఇలాంటి భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏవో సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించుకోవడానికి వీలుగా లేఖలు రాయడం పెద్ద విషయమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. 
     
    గాడ్గిల్ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు సమస్యలున్న నేపథ్యంలో.. మెట్రోను టేకోవర్ చేసుకోవాలంటూ గత ఫిబ్రవరిలోనే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించామని గుర్తుచేశారు. అలా తాము ప్రభుత్వానికి రాసిన లేఖల్లోంచి అక్కడక్కడా కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని పలు పత్రికలు ప్రచురించాయని.. సమస్య మొత్తాన్ని అర్థం చేసుకోలేదని వీబీ గాడ్గిల్ చెప్పారు. 
     
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులతో తాము మంచి సమన్వయంతో కలసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు కావాలనే పనిగట్టుకుని మెట్రోరైలు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. మెట్రోరైలు పనులు ఆలస్యమయ్యే అవకాశాలున్న పక్షంలో... వాటిని ఉన్నతస్థాయిలో పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామన్నారు. ఎన్నో సమస్యలున్నా.. దేశంలోనే అత్యంత వేగంగా మెట్రో రైలు పనులు జరుగుతున్నాయని.. మెట్రోపై వచ్చిన కథనాలపై తమ యాజమాన్యం కూడా అసంతృప్తితో ఉందని గాడ్గిల్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును గడువు కంటే ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం సహకరించకుండా.. సమస్యలు పరిష్కరించని పక్షంలో మరో ఆప్షన్ ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ.. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రయోజనకరమేనని గాడ్గిల్ వివరించారు. ప్రభుత్వానికి లేఖలు రాయడం నేరమేమీ కాదన్నారు.
     
     అలైన్‌మెంట్ మార్పు తెలియదు..
     మెట్రో రైలు మార్గం అలైన్‌మెంట్ మార్పు గురించి తమకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లేఖ అందలేదని గాడ్గిల్ వివరించారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో మాత్రం పనులు ఆపేయాలని కోరిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తమకు పనిచేసుకోవడానికి రైట్ ఆఫ్ వే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ముందు నుంచి కోరుతున్నట్లు వివరించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement