Profit Up
-
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
అంచనాలు మించి అదరగొట్టిన హెచ్‌సీఎల్ టెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్‌టెక్) అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. క్యూ2లో లాభం 7 శాతం వృద్ధి చెంది రూ. 3,489 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 3,259 కోట్లు. ఇక ఆదాయం 19.5 శాతం పెరిగి రూ. 24,686 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 5 శాతం, లాభం 6 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే క్యూ2లో లాభం 2.7 శాతం, ఆదాయం 3.4 శాతం పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కొత్త ఆర్డర్ల బుకింగ్ పటిష్టంగా ఉందని, భవిష్యత్ వృద్ధికి గణనీయంగా ఊతమివ్వగలదని సంస్థ సీఈవో సి. విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేరుకు రూ. 10 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గైడెన్స్‌ను 13.5–14.5 శాతానికి పెంచింది. సమీక్షాకాలంలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,19,325కి చేరింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 23.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో హెచ్‌సీఎల్ షేరు 3 శాతం ఎగిసింది. -
నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్‌టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
అంచనాలను మించిన ఎం అండ్ ఎం
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది. -
ఐసీఐసీఐకి తప్పని బ్యాడ్ లోన్ల బెడద
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలను సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసిక ఫలితాల నికర లాభాల్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసినా మొండిబకాయిల కష్టాలు మాత్రం ఈ బ్యాంకుకు కూడా తప్పలేదు.. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో బ్యాంక్ నికర లాభం 2.4 శాతం స్వల్ప వృద్ధితో రూ. 3102 కోట్లగాను, ఇతర ఆదాయం రూ.9,119కోట్లు గా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) కూడా నామమాత్రంగా పెరిగి రూ. 5253 కోట్లకు చేరింది. ఇక ప్రొవిజన్లు రూ. 942 కోట్ల నుంచి ఏకంగా రూ. 7083 కోట్లకు దూసుకెళ్లాయి. ఇది గత క్వార్టర్ లో రూ. 2,515ఉండగా, గత ఏడాదితో పోలిస్తే ఇది ఏడు రెట్లు అధికమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇతర ఆదాయం రూ. 3007 కోట్ల నుంచి రూ. 9119 కోట్లకు జంప్‌చేసింది. దీనిలో రూ. 5,682 కోట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో వాటా విక్రయం ద్వారా లభించినట్లు బ్యాంకు పేర్కొంది. అలాగే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.87 శాతం నుంచి 6.82 శాతంపెరుగుదలను నమోదు చేయగా, నికర ఎన్పీఏలు కూడా 3.35 శాతం నుంచి 3.57 శాతానికి పెరిగాయి. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 16.67 శాతంగా నమోదైంది. -
భారీ లాభాల్లో లుపిన్
భారత మూడో అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్ లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను అధిగమిస్తూ 48శాతం నికర లాభాలను నమోదుచేసింది. లుపిన్ కు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాలో ఎక్కువ ఫార్మా అమ్మకాలు నమోదు కావడంతో, ఈ జనవరి-మార్చి త్రైమాసిక లాభాలు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి రూ.807 కోట్ల నికర లాభాలను లుపిన్ చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లుపిన్ కు రూ.547 కోట్ల నికర లాభాలున్నాయి. అయితే థామ్సన్ రాయిటర్స్ కేవలం రూ.678 కోట్ల లాభాలు మాత్రమే కంపెనీకి వస్తాయని అంచనావేసింది. విశ్లేషకులు అంచనాలను అధిగమిస్తూ లుపిన్ దూసుకుపోయింది. ఈ ఫలితాలతో స్టాక్ మార్కెట్లో లుపిన్ షేర్లు లాభపడ్డాయి. రూ.6.85 లాభపడి, రూ.1,645గా ముగిసింది. ఇటీవల నెలల్లో అమెరికాలో కొత్త ఔషధాలకు కంపెనీకి అనుమతులు ఎక్కువగా లభించడంతో, లుపిన్ బాగా లాభపడింది. అయితే చాలా కంపెనీలు అమెరికాలో అనుమతులు పొందలేక రెగ్యులేటరీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. -
లాభాల్లో దూసుకెళ్లిన హెచ్ యూఎల్
ముంబై : దేశ అతిపెద్ద వినియోగ వస్తువుల సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్ యూఎల్) లాభాల్లో దూసుకెళ్లింది. గడిచిన ఆర్థికసంవత్సర నాలుగో త్రైమాసిక పలితాల్లో హెచ్ యూఎల్ లాభాలు 7శాతం జంప్ అయ్యాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి,నికర లాభాలను రూ.1,090 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.1,018 కోట్లగా ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, నిల్వవుంచే ఆహార ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో కంపెనీ లాభాలు పెరిగినట్టు హెచ్ యూఎల్ వెల్లడించింది. ఈ లాభాలతో కంపెనీ ఆదాయం 3.5శాతం వృద్ధితో రూ.7,675 కోట్ల నుంచి రూ.7,946 కోట్లకు ఎగబాకింది. అయితే ఈ త్రైమాసికంలో వాల్యుమ్ పెరుగుదల కొంత నిరాశపరిచింది. గతేడాది 6శాతంగా ఉన్న వాల్యుమ్ వృద్ధి ఈ ఏడాది 4 శాతం మాత్రమే నమోదుచేశాయి.