న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్‌టెక్) అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. క్యూ2లో లాభం 7 శాతం వృద్ధి చెంది రూ. 3,489 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 3,259 కోట్లు. ఇక ఆదాయం 19.5 శాతం పెరిగి రూ. 24,686 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 5 శాతం, లాభం 6 శాతం పెరిగాయి.
జూన్ త్రైమాసికంతో పోలిస్తే క్యూ2లో లాభం 2.7 శాతం, ఆదాయం 3.4 శాతం పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కొత్త ఆర్డర్ల బుకింగ్ పటిష్టంగా ఉందని, భవిష్యత్ వృద్ధికి గణనీయంగా ఊతమివ్వగలదని సంస్థ సీఈవో సి. విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేరుకు రూ. 10 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గైడెన్స్‌ను 13.5–14.5 శాతానికి పెంచింది. సమీక్షాకాలంలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,19,325కి చేరింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 23.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్‌లో హెచ్‌సీఎల్ షేరు 3 శాతం ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment