
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్‌జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్‌లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్‌జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది.
దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్‌టైమ్ పన్ను ఆదాయం ఓఎన్‌జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్‌చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఫలితాల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment