హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం లుపిన్‌లో భాగమైన లుపిన్ డిజిటల్ హెల్త్ (ఎల్‌డీహెచ్) తాజాగా హృద్రోగ చికిత్స పొందిన పేషంట్ల కోసం లైఫ్ పేరిట మొబైల్ యాప్ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. చికిత్స పొందిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, డాక్టర్లను మళ్లీ సంప్రదించాల్సిన సందర్భాలు మొదలైన వాటిని పర్యవేక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి, అవసరాన్ని బట్టి ఆరు పరికరాల నుంచి సేకరించే డేటా అంతా .. వాటికి అనుసంధానమైన లైఫ్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తమవుతుంది.
కంపెనీ తరఫు నుంచి నియమితులైన హెల్త్ కోచ్‌లు తదితర సిబ్బంది పేషంటుకు కావల్సిన తోడ్పాటు అందిస్తారని బుధవారమిక్కడ విలేకరులకు ఎల్‌డీహెచ్ సీఈవో సిద్ధార్థ్ శ్రీనివాసన్ తెలిపారు. డాక్టరే స్వయంగా సిఫార్సు చేయాల్సిన ఈ ప్రోగ్రాం సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ. 500 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా ఇది అందుబాటులో ఉందన్నారు.
ప్రస్తుతం 400 మంది వరకు డాక్టర్లు తమ ప్లాట్‌ఫాంలో చేరారని, వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 75 మంది వరకు ఉన్నారని ఎల్‌డీహెచ్ బిజినెస్ హెడ్ రాజేష్ ఖన్నా తెలిపారు. ఆగస్టు నాటికి 5,000 మందిని డాక్టర్లకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థలో 350 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని, మరిన్ని కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment