న్యూఢిల్లీ: మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 59 శాతం పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 31 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.49 కోట్లకు పెరిగిందని మహీంద్రా లైఫ్ స్పేస్ తెలిపింది. ఆదాయం రూ.259 కోట్ల నుంచి రూ.266 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎండీ, సీఈఓ అనిత అర్జున్‌దాస్ పేర్కొన్నారు. 60 శాతం డివిడెండ్‌ను(రూ.10 డివిడెండ్ గల ఒక్కో షేర్‌కు రూ.6) ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్ 3.47 శాతం వృద్ధితో రూ.460కు పెరిగింది.