క్యూ1లో నికర లాభం రూ. 6,368 కోట్లు
ఆదాయ అంచనాపెంపు
15,000–20,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్
కంపెనీ చరిత్రలోనే రికార్డ్ ఫ్రీ క్యాష్ ఫ్లో k
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది.
అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు.
ఈ షేరు బీఎస్‌ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది.
3–4 శాతం వృద్ధి
తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది.
ఇతర విశేషాలు
→ క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి.
→ ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు.
→ క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం.
→ ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది.
→ స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment