Work From Office: వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంపై ఇన్ఫోసిస్ (Infosys) సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచి పనిచేసేలా వారికి అనువైన అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోందని, అయితే తమ క్లయింట్లలో కొందరు వారి ప్రాజెక్ట్‌లను ఆఫీస్ నుంచే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని తాజాగా పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ అడిగిన ప్రశ్నకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో మరింత సామాజిక మూలధనం అవసరమని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, శిక్షణ మొదలైన వాటి కోసం ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
"మేము ఉద్యోగులకు అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు ఇంటి నుంచి లేదా హైబ్రిడ్ విధానంలో పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నాం. క్లయింట్‌లకు అవసరం అయినప్పుడు మాకు క్యాంపస్‌లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన సామాజిక అనుసంధానం, బృందంగా పని చేయాల్సిన చోట ఆ మేరకు పనిచేసే ఉద్యోగులు ఉంటారు" అని సీఈవో పరేఖ్ చెప్పారు.
ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జాక్‌పాట్! రూ. 3,722 కోట్ల భారీ డీల్ కైవసం..
సీఈవో పరేఖ్ అభిప్రాయాలను ఇన్ఫోసిస్ ప్రతిధ్వనిస్తోందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. "ఉద్యోగులు కొన్నిరోజులపాటు ఆఫీస్‌కు వచ్చి పని చేసేలా ప్రోత్సహిస్తున్నాం. ఇది సామాజిక మూలధనాన్ని పెంచుతుందని నమ్ముతున్నాం. వర్క్ ఫ్రం ఆఫీస్ అన్నది మా క్లయింట్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. క్లయింట్లు పట్టుబట్టినట్లయితే ఉద్యోగులు ఆఫీస్ వచ్చి పని చేయాల్సి ఉంటుంది" అని వివరించారు.
దక్షిణ అమెరికా, మిడిలీస్ట్ ప్రాంతాల్లో వ్యాపారం గురించి మరొక షేర్ హోల్డర్ అడిన ప్రశ్నకు పరేఖ్ బదులిస్తూ.. ఇన్ఫోసిస్ ఆ రెండు ప్రాంతాలలో ఉనికిని కలిగి ఉందని, అయితే ఆదాయంలో వాటి వాటా చాలా తక్కువగా ఉందని చెప్పారు. కాగా ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు!
Comments
Please login to add a commentAdd a comment