అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్‌ మాత్రం ఓకే.. | Infosys will adhere to local hiring regulations CEO Salil Parekh | Sakshi
Sakshi News home page

అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్‌ మాత్రం ఓకే..

Published Fri, Jul 19 2024 8:14 AM | Last Updated on Fri, Jul 19 2024 9:38 AM

Infosys will adhere to local hiring regulations CEO Salil Parekh

ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి అన్ని కంపెనీలు భయోందోళన చెందుతుంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాత్రం తమకు ఓకే అంటోంది.

ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నియామకాలకు రాష్ట్ర ప్రతిపాదిత రిజర్వేషన్లకు ప్రతిస్పందనగా కర్ణాటక ఏ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా తమ కంపెనీ పాటిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని పరేఖ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చినా మద్దతిస్తాం.

పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్‌ కల్పించే కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం ప్రారంభంలో ఆమోదించింది. ఏ పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థలు అయినా మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.

ఈ బిల్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే వ్యాపార ప్రముఖులు, టెక్నాలజీ రంగ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ఆంక్షల వల్ల స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఏర్పడితే కంపెనీలు తరలిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) హెచ్చరించింది.

ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదనను సోషల్ మీడియాలో ‘షేమ్‌’ అంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపాదిత కోటాను 'ఫాసిస్టు', 'స్వల్పదృష్టి'గా అభివర్ణిస్తూ పరిశ్రమ పెద్దలు కూడా ఈ కోటాపై తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును తిరోగమనంగా అభివర్ణించారు. బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోచామ్ కర్ణాటక కో-చైర్మన్ ఆర్కే మిశ్రా వ్యతిరేక స్వరం వినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement