
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్స్ తయారీ దిగ్గజం హెచ్‌పీ తాజాగా తొమ్మిది ల్యాప్‌టాప్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటి ధర రూ. 78,999 (16 అంగుళాల హెచ్‌పీ ఆమ్నిబుక్5 నుంచి రూ. 1.86 లక్షల వరకు (హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 14 అంగుళాలు) ఉంటుంది.
మరోవైపు, భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని 2031 నాటికి రెట్టింపు చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీనితో భారత్‌లో విక్రయించే ప్రతి మూడు హెచ్‌పీ పీసీల్లో ఒకటి ఇక్కడ తయారు చేసినదే ఉంటుందని సంస్థ భారత విభాగం సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.
2025లో భారత్‌లో తాము విక్రయించే మొత్తం పీసీల్లో 13 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఉంటాయని వివరించారు. 2024లో దేశీ పీసీ మార్కెట్లో 30.1 శాతం వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో నిల్చింది. కంపెనీ తమ ల్యాప్‌టాప్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీలు డిక్సన్, వీవీడీఎన్‌తో జట్టు కట్టింది.