
భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉన్న తన రిటైల్ అవుట్‌లెట్లలో స్టార్‌లింక్ హార్డ్‌వేర్‌ను అందించడానికి స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలను మరింత సులువుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇది దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుందని చెప్పింది. అయితే, స్పేస్ఎక్స్ దేశంలో తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రెగ్యులేటరీ అనుమతులను పొందాల్సి ఉంది.
రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఆర్థిక పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను హైలైట్ చేసింది. జియో విస్తృతమైన స్థానిక ఉనికిని, స్టార్‌లింక్ అత్యాధునిక లో-ఎర్త్-ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీతో కలపడం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సర్వీసులు అందించవచ్చని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. స్టార్‌లింక్ పరికరాల ఇన్‌స్టలేషన్, యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ మెకానిజంను ఏర్పాటు చేయడం, వినియోగదారులకు అంతరాయం లేని సర్వీసులు అందించడం ఈ సహకారంలో భాగం. ఇది అందుబాటులోకి వస్తే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లైన జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్లకు అనుబంధంగా ఉంటాయో లేదో తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!
జియో ప్రస్తుత చర్యలు దేశంలో డిజిటల్ అంతరాన్ని పూడ్చడానికి ఎంతో తోడ్పడుతాయని కంపెనీ నమ్ముతుంది. స్టార్‌లింక్ అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిమోట్ ఏరియాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 2025 నాటికి రిలయన్స్ జియో 48.8 కోట్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఇందులో 19.1 కోట్లు ట్రూ 5జీ వినియోగదారులు ఉన్నారు.