
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ గత 74 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పతనాన్ని 2020లో నమోదుచేసుకుంది. క్షీణత 3.5 శాతంగా నమోదయ్యింది. అయితే నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4 శాతం వృద్ధి నమోదుకావడం కొంత ఊరటనిచ్చే అంశం. వార్షికంగా చూస్తే, 1946 తరువాత ఇంత తీవ్ర పతనాన్ని చూడ్డం ఇదే తొలిసారని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్ వంటి పలు సేవా రంగాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని... ఈ ఫలితం గురువారం విడుదలైన వార్షిక గణాంకాల్లో కనిపించందనీ ఉన్నత స్థాయి వర్గాలు వ్యాఖ్యానించాయి.
జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో అమెరికా జీడీపీ 33 శాతంపైగా పతనమైన సంగతి తెలిసిందే. జనవరి–మార్చి త్రైమాసికంలో క్షీణరేటు 5 శాతంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయం 1946లో 11.6 క్షీణత తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009 కాలంలో ఎకానమీ 2.5 శాతం పతనమైంది. 1932 తీవ్ర మాంద్యం సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం పతనమైంది. అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలను మూడుసార్లు సవరించడం జరుగుతుంది. దీని ప్రకారం తాజా– డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను మరో రెండు సార్లు సవరిస్తారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎకానమీ అవుట్‌లుక్ అనిశ్చితిగానే కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా లభ్యం అయ్యేంత వరకూ క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment