Stock Market: బేర్‌ విశ్వరూపం | Stock Market: Yen rises to 7-month highs as US slowdown fears carry over | Sakshi
Sakshi News home page

Stock Market: బేర్‌ విశ్వరూపం

Published Tue, Aug 6 2024 4:45 AM | Last Updated on Tue, Aug 6 2024 8:05 AM

Stock Market: Yen rises to 7-month highs as US slowdown fears carry over

కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

సెన్సెక్స్‌ 2223 పాయింట్లు క్రాష్‌ 

79 వేల స్థాయిని కోల్పోయిన సూచీ 

నిఫ్టీకి 662 పాయింట్ల నష్టం  

ఒక్క రోజులో రూ.15 లక్షల కోట్లు ఆవిరి  

ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్‌ కరెన్సీ యెన్‌ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్‌ స్ట్రీట్‌ సోమవారం బేర్‌ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్‌ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్‌ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం.  

రోజంతా నష్టాల కడలిలో ...  
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.  
→ బీఎస్‌ఈలోని  అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్‌ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్‌ గూడ్స్‌ 4.1%, ఇండస్ట్రీయల్‌ 4%, విద్యుత్‌ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్‌ 3.75% చొప్పున క్షీణించాయి. 
→ సెన్సెక్స్‌ సూచీలో హెచ్‌యూఎల్‌(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్‌ 7%, అదానీ పోర్ట్స్‌ 6%, టాటాస్టీల్‌ 5%, ఎస్‌బీఐ 4.50%, పవర్‌ గ్రిడ్‌ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి.  
→ చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. 
→ బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి.  
→ రిలయన్స్‌ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ క్యాప్‌ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది.  
→ మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్‌(వీఐఎక్స్‌) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్‌ బ్రదర్స్, కోవిడ్‌ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.

2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి 
ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్‌ఈలో మార్కెట్‌ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు  పడింది.

84 దిగువకు రూపాయి 
కొత్త ఆల్‌టైమ్‌ కనిష్టం
ఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్‌ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్‌ స్ట్రీట్‌ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది.   

‘అమ్మో’రికా! 
ముసిరిన మాంద్యం భయాలు.. 
ఉద్యోగాల కోత.. హైరింగ్‌ తగ్గుముఖం.. 
మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్‌ 
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్‌... 
ఫెడ్‌ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడా

అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్‌ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్‌ మార్కెట్‌ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్‌ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్‌ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్‌ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్‌డాక్‌ 2.4% కుప్పకూలింది. డోజోన్స్‌ 1.5%, ఎస్‌అండ్‌పీ–500 ఇండెక్స్‌ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరిన నాస్‌డాక్‌ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్‌లోకి జారింది. ఆసియా, యూరప్‌ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్‌ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

టెక్‌ స్టాక్స్‌.. ట్రిలియన్‌ డాలర్లు ఆవిరి 
రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్‌డాక్‌లో టాప్‌–7 టెక్‌ టైటాన్స్‌ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్‌వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్‌ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్‌ షేర్లు 10% క్రాష్‌ అయ్యాయి. ఫలితాల నిరాశతో  ఇంటెల్‌ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్‌ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్‌–7 టెక్‌ షేర్ల మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్‌ ఇస్తున్నారు. 

యుద్ధ సైరన్‌..: పశ్చిమాసియాలో హమాస్‌ చీఫ్‌ హనియేను ఇజ్రాయిల్‌ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్‌ మొదలైతే క్రూడ్‌ ధర భగ్గుమంటుంది. బ్యారల్‌ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది.
 

జపాన్‌.. సునామీ 
అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్‌ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్‌ నికాయ్‌ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్‌ అయింది. 1987 అక్టోబర్‌ 19 బ్లాక్‌ మండే (14.7% డౌన్‌) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్‌ ఆల్‌ టైమ్‌ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్‌ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్‌ యెన్‌ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్‌ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్‌ మన మార్కెట్‌ సహా ఆసియా, యూరప్‌ సూచీలను కుదిపేస్తోంది.

ఫెడ్‌ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్‌ ఫండ్స్‌ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్‌ క్వార్టర్లో (క్యూ2)  యూఎస్‌ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్‌ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్‌ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్‌ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్‌ అంటోంది!

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement