న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి.
పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది.
మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు.
‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment