ఐసీఐసీఐ బ్యాంక్ 15% లాభం అప్ | ICICI Bank Q4 net up 15% at Rs. 2652cr | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్ 15% లాభం అప్

Published Sat, Apr 26 2014 1:19 AM | Last Updated on Wed, Sep 19 2018 8:41 PM

ఐసీఐసీఐ బ్యాంక్ 15% లాభం అప్ - Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్ 15% లాభం అప్

 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రుణాల పునర్‌వ్యవస్థీకరణ కూడా తగ్గొచ్చు. రిటైల్ రుణాల్లో ప్రస్తుతం వృద్ధి జోరు ఇదేవిధంగా కొనసాగనుంది. అదేవిధంగా నికర వడ్డీ మార్జిన్‌లు కూడా ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - చందా కొచర్,  ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ
 
 ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.2,652 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.2,304 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఫీజులు ఇతరత్రా రూపంలో లభించిన వడ్డీయేతర ఆదాయం భారీగా ఎగబాకడం... బ్యాంక్ లా భాల జోరుకు దోహదం చే సింది. కాగా, క్యూ4లో కంపెనీ మొత్తం ఆదా యం రూ.14,465 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.12,574 కోట్ల ఆదాయంతో పోలిస్తే 15 శాతం మేర వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదా యం క్యూ4లో 15 శాతం పెరుగుదలతో రూ.4,357 కోట్లకు చేరింది. ఇక వడ్డీయేతర ఆదాయం ఏకంగా 35 శాతం ఎగబాకి రూ.2,976 కోట్లుగా నమోదైంది. ఫీజుల రూపంలో రూ.1,974 కోట్లు(12 శాతం వృద్ధి), ట్రెజరీ ఆదాయం రూ.245 కోట్లు చొప్పున లభించాయి. ఇక అనుబంధ సంస్థల నుంచి బ్యాంకుకు రూ.541 కోట్ల భారీ డివిడెం డ్ మొత్తం జమ అయింది.

 పూర్తి ఏడాదికి ఇలా....
 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ స్డాండెలోన్ నికర లాభం రూ.9,810 కోట్లకు ఎగసింది. 2012-13 ఏడాదిలో నమోదైన రూ.8,325 కోట్లతో పోలిస్తే లాభం 18% పెరిగింది. మొత్తం ఆదా యం విషయానికొస్తే... రూ.48,421 కోట్ల నుంచి 54,606 కోట్లకు(12%) వృద్ధి చెందింది.

 కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన...
 మార్చి క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రూ.2,724 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,492 కోట్లతో పోల్చిచూస్తే 9 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ.20,240 కోట్ల నుంచి రూ.21,653 కోట్లకు పెరిగింది. 7 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2013-14 పూర్తి ఏడాదికి లాభం రూ.9,604 కోట్ల నుంచి రూ.11,041 కోట్లకు(15% వృద్ది) ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా రూ.74,204 కోట్ల నుంచి రూ.79,564 కోట్లకు(7.2 శాతం అప్) పెరిగింది.

 నికర మొండిబకాయిలు పెరిగాయ్...
 మార్చితో ముగిసిన కాలానికి ఐసీఐసీఐ నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏ)లు రూ.3,321 కోట్లకు(0.82 శాతం) పెరిగాయి. డిసెంబర్ చివరినాటికి రూ.3,121 కోట్లు(0.81%), క్రితం ఏడాది మార్చి చివరినాటికి రూ.2,234 కోట్లు(0.64%)గా నికర ఎన్‌పీఏలు నమోదయ్యాయి. కాగా, క్యూ4లో తాజాగా రూ.1,241 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. దీంతో స్థూల మొండిబకాయిలు మార్చి చివరినాటికి 3.03 శాతానికి చేరాయి. డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే దాదాపు అదేస్థాయిలోనే నమోదయ్యాయి.

క్యూ4లో రూ.400 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోవడం దీనికి దోహదం చేసింది. కాగా, క్యూ4లో రూ.700 కోట్ల విలువైన ఎన్‌పీఏలను బ్యాంక్ ఖాతాలనుంచి తొలగించింది(రైట్ ఆఫ్). రూ.2,156 కోట్ల విలువైన రుణాలను పునర్‌వ్యవస్థీకరించడంతో 2013-14 పూర్తి ఏడాదికి ఈ విధమైన రుణాల మొత్తం రూ.10,558 కోట్లకు ఎగబాకింది. మరో 1,500 కోట్ల రుణాలు పునర్‌వ్యవస్థీకరణ బాటలో ఉన్నాయి. 2012-13 మార్చి క్వార్టర్‌లో రూ.460 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలపై ప్రొవిజనింగ్ ... 2013-14 మార్చి క్వార్టర్‌లో రూ.714 కోట్లకు పెరగడంతో లాభాలపై ప్రభావం చూపింది.
 
 
 ఇతర ముఖ్యాంశాలివీ...

2013-14 పూర్తి ఏడాదికి ఐసీఐసీఐ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.23 డివిడెండ్‌ను ప్రకటించింది.

బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ క్యూ4లో 3.35 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే పెద్దగా వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది. అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం 0.22 శాతం పెరిగి 3.33 శాతానికి చేరింది.

2013-14 ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణాలు 17% వృద్ధి చెంది రూ.3,38,703 కోట్లకు పెరిగాయి. ప్రధానంగా రిటైల్ రుణాల్లో 23% వృద్ధి సాధించింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.3,31,914 కోట్లకు ఎగబాకాయి.

అనుంబంధ సంస్థల విషయానికొస్తే... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నికర లాభం గ డచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,496 కోట్ల నుంచి రూ.1,567 కోట్లకు పెరిగింది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ నికర లాభం రూ.306 కోట్ల నుంచి రూ.511 కోట్లకు వృద్ధి చెందింది.

క్యూ4లో బ్యాంక్ కొత్తగా 653 శాఖలు, 834 ఏటీఎంలను ఏర్పాటు చేసింది. దీంతో మార్చినాటికి ఐసీఐసీఐ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 3,753కు, ఏటీఎంల సంఖ్య 11,315కు చేరాయి.

ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 2.29% క్షీణించి రూ.1,269 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement