మారుతీ లాభం 12% డౌన్ | Maruti Suzuki reports 12% decline in fourth quarter | Sakshi
Sakshi News home page

మారుతీ లాభం 12% డౌన్

Published Wed, Apr 27 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

మారుతీ లాభం 12% డౌన్

మారుతీ లాభం 12% డౌన్

క్యూ4లో రూ.1,134 కోట్లు
హర్యానాలో రిజర్వేషన్ల ఆందోళనలు;
అధిక ప్రచార వ్యయాల ప్రభావం
ఆదాయం మాత్రం 13 శాతం వృద్ధి; రూ.14,930 కోట్లు
షేరుకి రూ.35 చొప్పున డివిడెండ్

న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ లాభాలకు బ్రేక్ పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ నికర లాభం రూ.1,134 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,284 కోట్లతో పోలిస్తే... 12 శాతం దిగజారింది. గడచిన ఎనిమిది త్రైమాసికాల్లో కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం 2013-14 ఏడాది నాలుగో త్రైమాసికంలో మారుతీ లాభం పడిపోయింది.

ప్రధానంగా హరియాణాలో జాట్ల రిజర్వేషన్ ఆందోళనలతో ఉత్పత్తికి అంతరాయం కలగడం, ప్రచార వ్యయాలు భారీగా పెరగడం, ఇతర ఆదాయం తగ్గడం వంటివి లాభాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. జాట్ల ఆందోళనల కారణంగా క్యూ4లో 10,000 యూనిట్ల మేర ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అయితే, మారుతీ మొత్తం ఆదాయం మాత్రం క్యూ4లో 12.5 శాతం ఎగబాకి రూ.14,930 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.13,273 కోట్లుగా ఉంది.

 అత్యధిక వార్షిక లాభాల రికార్డు...
2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మారుతీ నికర లాభం 23.2 శాతం ఎగబాకి రూ.4,571 కోట్లకు చేరింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా కొత్త రికార్డు నమోదైంది. 2014-15 ఏడాదికి కంపెనీ లాభం రూ.3,711 కోట్లుగా నమోదైంది(ఇదే ఇప్పవరకూ అత్యధిక లాభం). మొత్తం ఆదాయం 16% వృద్ధితో రూ.48,606 కోట్ల నుంచి రూ.56,350 కోట్లకు ఎగసింది. కాగా, రాయల్టీ రూపంలో మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు గతేడాది 6%(మొత్తం ఆదాయంలో) చెల్లించినట్లు మారుతీ తెలిపింది. 2014-15లో రాయల్టీ చెల్లింపు 5.7 శాతంగా ఉంది.

 అమ్మకాలు ఇలా: క్యూ4లో కంపెనీ కార్ల అమ్మకాలు 3.9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం 3,60,402 కార్లను కంపెనీ విక్రయించింది. 27,009 కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఇక 2015-16 పూర్తి ఏడాదిలో మారుతీ అమ్మకాల సంఖ్య రికార్డు స్థాయిలో 14,29,248కి చేరింది. 10.6 శాతం వృద్ధి నమోదైంది. 1,23,897 వాహనాలను ఎగుమతి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ‘కొత్త మోడళ్ల విడుదల... నెట్‌వర్క్ విస్తరణతో అమ్మకాలు జోరందుకున్నాయి. అదేవిధంగా ముడి ఉత్పత్తుల వ్యయం తగ్గడంతో పాటు వ్యయాల తగ్గింపునకు చేపట్టిన చర్యలు లాభాలకు దన్నుగా నిలిచాయి. విటారా బ్రెజా, బాలెనోల విడుదల కారణంగా అడ్వర్టైజింగ్ వ్యయం పెరిగింది.’ అని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

 700 శాతం డివిడెండ్...
గడచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపై మారుతీ రూ.35 చొప్పున(700 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. 2014-15లో డివిడెండ్ 500 శాతం(రూ.25)గా ఉంది.

 మారుతీ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 3.62 శాతం లాభపడి రూ.3,869 వద్ద ముగిసింది.

ఈ ఏడాది రూ.4,400 కోట్ల పెట్టుబడి..
ఆర్థిక వ్యవస్థ కాస్త మందగమనంలో ఉన్నప్పటికీ... గత ఏడాది తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించగలిగామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మా వంతు సహకారాన్ని అందిస్తున్నాం. పలు ప్రతికూల పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ... ఈ ఏడాది కూడా మా అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.4,400 కోట్ల మేరకు పెట్టుబడులను వెచ్చించనున్నాం. గుజరాత్ ప్లాంట్ నిర్మాణ పనులు అనుకున్నదానికంటే జోరుగా సాగుతున్నాయి.

వచ్చే ఏడాది జనవరికల్లా(వాస్తవ షెడ్యూలు మే నెల) ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. మరోపక్క, గుర్గావ్, మానెసర్ ప్లాంట్లలోనూ ఉత్పత్తిని పెంచడం ద్వారా కస్టమర్లకు వెయిటింగ్ వ్యవధిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాం’ అని భార్గవ వివరించారు. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 14.3 లక్షల యూనిట్లు కాగా, దీన్ని 15.7 లక్షల యూనిట్లకు పెంచాలనేది కంపెనీ ప్రణాళిక. కాగా, ఆఫ్రికాలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని మారుతీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే చిన్న వాణిజ్య వాహనా(ఎల్‌సీవీ)న్ని దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement