![Surya Kumar Yadav Out For 70 Runs In Ranji Trophy Quarter Final Vs Haryana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/sky.jpg.webp?itok=g0Z3xZ_v)
గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో (Ranji Trophy) భాగంగా హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే ఔటైన స్కై.. రెండో ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తన జట్టు (ముంబై) కష్టాల్లో ఉన్నప్పుడు (100/3) బరిలోకి దిగిన స్కై.. కెప్టెన్ ఆజింక్య రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు జోడించాడు. అనూజ్ థక్రాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన స్కై.. ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రహానేకు (71) జతగా శివమ్ దూబే (7) క్రీజ్‌లో ఉన్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ముంబై ఆధిక్యం 252 పరుగులుగా ఉంది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే 31, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 43 పరుగులు చేసి ఔటయ్యారు. హర్యానా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్, అనూజ్ థక్రాల్, జయంత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
ఆరేసిన శార్దూల్
అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.
సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహానే సహా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, రహానే 31, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది.
చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ చాలాకాలం తర్వాత హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్కై.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. టీ20ల్లో గత 9 ఇన్నింగ్స్‌ల్లో స్కై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ మార్కును తాకాడు.
వన్డేల్లో కూడా స్కై పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో స్కై చివరిసారి హాఫ్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో స్కై.. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్ అనంతరం జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో స్కై దారుణంగా విఫలమయ్యాడు. ఆ మెగా టోర్నీలో స్కై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్‌పై చేసిన 49 పరుగులే స్కైకు అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment