వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణించింది. బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ (బీఈఏ) తుది సమీక్ష (మూడవ దఫా అంచనాల సవరణ) అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు క్రితం మైనస్ 1.5 శాతం గణాంకాలను ఎగువముఖంగా సవరించడం జరిగింది. వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో అమెరికా ఎకానమీ మాంద్యంలోకి జారిపోతుందన్న ఆందోళనలు నేపథ్యంలో తాజా ఫలితాలు వెలువడ్డం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతను నమోదుచేస్తే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు.
మార్చి నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ ఓవర్‌నైట్ వడ్డీరేటు 150 బేసిస్ పాయింట్లు పెంచిన (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) సంగతి తెలిసిందే. ఎకానమీ మైనస్‌లోకి జారుతున్నా, దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లుగా పేర్కొంటూ అధికారులు పరిస్థితిని పక్కదారిపట్టిస్తున్నారన్న విమర్శలూ నెలకొనడం గమనార్హం. మేలో రిటైల్ అమ్మకాలు పడిపోయాయి. గృహ నిర్మాణం, అనుమతులు తగ్గిపోయాయి. జూన్‌లో వినియోగ విశ్వాసం 16 నెలల కనిష్టానికి పడిపోయింది. వినియోగ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి ఎగసింది. క్యూ1లో వాణిజ్యలోటు భారీగా పెరగడం (3.2 శాతం) ఎకానమీకి ప్రతికూలంగా మారింది. గత ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ 6.9 శాతం పటిష్ట వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment