Rupee exchange rate
-
రూపాయి మరింత క్రాష్ ..
ముంబై: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు ప్రతి రోజు సరికొత్త రికార్డు కనిష్టాలకు పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం మరో 49 పైసలు క్షీణించి 87 స్థాయిని కూడా దాటేసింది. 87.11 వద్ద క్లోజయ్యింది. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్‌ల మోత మోగించడమనేది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించడం .. మన రూపాయిపైనా ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా డాలరు పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసర్చ్ ఆనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అమెరికా టారిఫ్‌లపై ఆందోళన వల్ల కూడా రూపాయి మీద ఒత్తిడి పెరగవచ్చని వివరించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కాస్త బ్రేక్ పడొచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న 85.61 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 1.8 శాతం క్షీణించింది.మార్కెట్ ఆధారితమైనదే..: రూపాయి మారకం విలువ మార్కెట్ ఆధారితంగానే ఉంటుందే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగ్గించడమనేది జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. డాలర్ ఇండెక్స్, పెట్టుబడుల ప్రవాహాలు, వడ్డీ రేట్లు, క్రూడాయిల్ కదలికలు, కరెంటు అకౌంటు లోటు తదితర జాతీయ, అంతర్జాతీయ అంశాలెన్నో రూపాయిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతులపరంగా పోటీపడేందుకు వీలవుతుందని, ఇది ఎకానమీకి సానుకూలమని చెప్పారు. -
పుత్తడి @ 67,000
దీర్ఘకాలికంగా పసిడి పది గ్రాముల ధర రూ. 65,000–67,000 దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. దీనికి ఊతమిచ్చే అంశాలను ఈ విధంగా వివరించింది. ‘గడిచిన దశాబ్దకాలంలో దేశీయంగా పసిడి 159 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే సమయంలో కీలకమైన స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇచ్చిన రాబడులు 93 శాతమే. ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ క్షీణత నుంచి రక్షణనివ్వడంలో పసిడి స్టార్ పెర్ఫార్మర్గా నిల్చింది. మధ్యమధ్యలో కాస్తంత తగ్గడం మినహా వార్షికంగా చూస్తే పుత్తడి ఇప్పటిదాకా మంచి రాబడులే ఇచ్చింది. డిమాండ్, పండుగల ఊతంతో నాలుగో త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అధిక ధరలు, కరోనావైరస్పరమైన అంశాల కారణంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రభావం చూపడంతో మొత్తం మీద చూస్తే పసిడి వినియోగం తగ్గినప్పటికీ.. పెరుగుతున్న రేటు కారణంగా ఇన్వెస్టర్లు క్రమంగా పుత్తడి వైపు మళ్లడం వల్ల నాణేలు, కడ్డీలకు మాత్రం డిమాండ్ పెరిగింది. అనిశ్చితి పరిస్థితుల కారణంగా పుత్తడి ధర అంతర్జాతీయంగా ఔన్సు (33.1 గ్రాములు)కి 2,085 డాలర్లు, దేశీయంగా పది గ్రాములకు రూ. 56,400 గరిష్ట స్థాయిలను తాకి ప్రస్తుతం ఒక శ్రేణిలో తిరుగాడుతోంది. సెంట్రల్ బ్యాంకుల విధానాలు, తక్కువ వడ్డీ రేట్లు.. రాబడులు, మార్కెట్లోకి నిధుల వెల్లువ, కరోనా వైరస్ ప్రభావం తదితర అంశాలు దీర్ఘకాలంలో పసిడి రేట్లకు ఊతమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రూ. 49,500–48,500 దాకా తగ్గినప్పుడల్లా కొంతకొంతగా కొనుగోలు చేయొచ్చు. స్వల్పకాలికంగా రూ. 52,000–53,000 దాకా పెరగవచ్చు. దీర్ఘకాలికంగా మాత్రం పది గ్రాములకు రూ. 65,000–67,000 స్థాయికి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 2,500 డాలర్ల అంచనాలను కొనసాగిస్తున్నాం. -
రూపాయి135 పైసలు అప్ - 63.20 వద్ద ముగింపు
ముంబై: ఆరు రోజుల వరుస పతనానికి బ్రేక్ వేస్తూ.. రూపాయి శుక్రవారం అనూహ్యంగా కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 135 పైసలు పెరిగి 63.20 వద్ద క్లోజయ్యింది. ఇంత స్థాయిలో పెరగడం ఈ ద శాబ్దంలో ఇది రెండోసారి. ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ గురువారం చేసిన వ్యాఖ్యలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. దేశీ కరెన్సీ గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టం 65.56కి పడిపోయిన నేపథ్యంలో నిరాశావాదానికి లోనుకానక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయంటూ ఆర్బీఐ ప్రకటించడం మార్కెట్ వర్గాలకు కాస్త భరోసా కల్పించాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.55తో పోలిస్తే పటిష్టంగా 64.30 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, ఆ తర్వాత కనిష్ట స్థాయి 64.75కి కూడా తగ్గింది. కానీ చివర్లో 2.09 శాతం ఎగిసి 63.20 వద్ద ముగిసింది. 2009 మే 18 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశీ కరెన్సీ 152 పైసలు (3.08 శాతం) ఎగిసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వరంగ బ్యాంకులు డాలర్లను విక్రయించి ఉంటాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్డ్ ఇన్కమ్ ట్రేడింగ్ విభాగం హెడ్ ఆగమ్ గుప్తా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను నియంత్రించడంపై ప్రభుత్వం, ఆర్బీఐ పట్టుదలగా ఉన్నాయనే భరోసాతో కార్పొరేట్లు కూడా డాలర్లను విక్రయించారని ఆయన పేర్కొన్నారు. స్పాట్ ట్రేడింగ్‌లో దేశీ కరెన్సీ 63.40-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. 60-61కి పెరగొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 80 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గగలదని బ్రిటన్‌కి చెందిన బార్క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ క్యాడ్‌ని పూర్తిగా భర్తీ చేసుకోగలదని పేర్కొంది. దీంతో వచ్చే 12 నెలల్లో రూపాయి విలువ 61 స్థాయికి కోలుకోగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీ కరెన్సీ 60 స్థాయికి పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం సహా చమురుయేతర దిగుమతులు ద్వితీయార్థంలో దిగిరావడం ద్వారా క్యాడ్ గణనీయంగా తగ్గగలదని పేర్కొంది.