మరో 49 పైసల క్షీణత
87.11 వద్ద ముగింపు
డాలరు పటిష్టత, వాణిజ్య యుద్ధ భయాల ఎఫెక్ట్
ముంబై: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు ప్రతి రోజు సరికొత్త రికార్డు కనిష్టాలకు పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం మరో 49 పైసలు క్షీణించి 87 స్థాయిని కూడా దాటేసింది. 87.11 వద్ద క్లోజయ్యింది. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్‌ల మోత మోగించడమనేది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించడం .. మన రూపాయిపైనా ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా డాలరు పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసర్చ్ ఆనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు.
అమెరికా టారిఫ్‌లపై ఆందోళన వల్ల కూడా రూపాయి మీద ఒత్తిడి పెరగవచ్చని వివరించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కాస్త బ్రేక్ పడొచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న 85.61 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 1.8 శాతం క్షీణించింది.
మార్కెట్ ఆధారితమైనదే..: రూపాయి మారకం విలువ మార్కెట్ ఆధారితంగానే ఉంటుందే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగ్గించడమనేది జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. డాలర్ ఇండెక్స్, పెట్టుబడుల ప్రవాహాలు, వడ్డీ రేట్లు, క్రూడాయిల్ కదలికలు, కరెంటు అకౌంటు లోటు తదితర జాతీయ, అంతర్జాతీయ అంశాలెన్నో రూపాయిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతులపరంగా పోటీపడేందుకు వీలవుతుందని, ఇది ఎకానమీకి సానుకూలమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment