
నెమ్మదించిన పబ్లిక్ ఇష్యూలు
వెనక్కి తగ్గుతున్న కంపెనీలు
సెకండరీ మార్కెట్లో కరెక్షనే కారణం
న్యూఢిల్లీ: గతేడాదంతా జోరుగా దూసుకెళ్లిన ఐపీఓల మార్కెట్ ప్రస్తుతం సెకండరీ మార్కెట్లో కరెక్షన్ కారణంగా నెమ్మదించిన ధోరణి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితులు దీన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2024 డిసెంబర్‌లో ఏకంగా 16 లిస్టింగ్స్ నమోదు కాగా .. ఈ ఏడాది జనవరిలో అయిదు ఇష్యూలు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య నాలుగుకి తగ్గింది. అంతేగాకుండా కొన్ని కంపెనీలు ఐపీఓ ప్రణాళికలను పక్కన పెడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో అడ్వాన్స్‌డ్ సిస్–టెక్, ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, వినే కార్పొరేషన్ ఇలా ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్న వాటిల్లో ఉన్నాయి.
గత రెండు నెలల్లో ప్రధానంగా సెకండరీ మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడిందని ఈక్విరస్ ఎండీ భావేష్ షా తెలిపారు. దీనితో ఇన్వెస్టర్లు కొత్త లిస్టింగ్‌లవైపు చూడటం కాకుండా ప్రస్తుతమున్న పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. ఇలా కొత్త ఐపీఓలపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లడంతో పబ్లిక్ ఇష్యూల మార్కెట్ కూడా నెమ్మదించిందని ఆయన పేర్కొన్నారు. పటిష్టమైన ఎకానమీ, మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు భారీగా పెరగడం వంటి సానుకూలాంశాలతో 2014లో ఏకంగా 91 ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి.
అయినప్పటికీ.. ఆశావహమే..
పబ్లిక్ ఇష్యూలపై ప్రస్తుతానికి ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లినప్పటికీ .. దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం మార్కెట్ సానుకూలంగానే కనిపిస్తోందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్‌రావు తెలిపారు. పెద్ద ఎత్తున సంస్థలు ఐపీఓకి సిద్ధమవుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘పెద్ద సంఖ్యలో ప్రాస్పెక్టస్‌లు దాఖలవుతున్నాయి. మార్కెట్లు స్థిరపడటం కోసం కంపెనీలు వేచిచూస్తున్నాయి. ప్రస్తుతం రూ. 67,000 కోట్లు సమీకరించడానికి 45 కంపెనీలకు సెబీ అనుమతులు ఉన్నాయి. మరో రూ. 1.15 లక్షల కోట్ల సమీకరణ కోసం 69 కంపెనీలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో 45 కంపెనీలు గత కొద్ది నెలల్లో ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి‘ అని ఆయన పేర్కొన్నారు.
గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 30 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను సమరి్పంచినట్లు వివరించారు. సత్వ గ్రూప్, బ్లాక్‌స్టోన్ దన్ను గల నాలెడ్జ్ రియల్టీ ట్రస్ట్ ఈమధ్యే రూ. 6,200 కోట్ల సమీకరణకు సంబంధించి పత్రాలు దాఖలు చేసింది. రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లు స్థిరపడిన తర్వాత ఐపీఓలు మళ్లీ పుంజుకుంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని షా ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో పాటు మదుపరులు కూడా కొత్త కంపెనీల్లో తాజాగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే, ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ వేల్యుయేషన్లను సరిచేసుకోవాల్సి ఉంటుందని షా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment