మళ్లీ ఐపీవోలవైపు కంపెనీల చూపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళుతున్న నేపథ్యంలో దేశీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు క్యూకట్టే అవకాశముంది. ఎన్‌డీఏ నేతృత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్న కారణంగా ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. వెరసి మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 24,000 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు సమాయత్తంకాగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐపీవోలను నిర్వహించే మర్చంట్ బ్యాంకర్ల సమాచారంమేరకు కనీసం 12 సంస్థలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం 14 సంస్థలు రూ. 2,796 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మార్కెట్లు మందగించడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించిన విషయం విదితమే.