న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణ కల్పించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెకండరీ మార్కెట్లోనూ అస్బాకు తెరతీసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. షేర్ల జారీ తదుపరి ఖాతాలో నిలిపి ఉంచిన సొమ్ము బదిలీ(అస్బా) పద్ధతికి దన్నుగా ప్రస్తుతం అనుబంధ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ప్రైమరీ మార్కెట్లో వినియోగించే అస్బా సౌకర్యాన్ని 2024 జనవరి 1కల్లా సెకండరీ మార్కెట్లోనూ అమలు చేసే చర్యలకు తెరతీసింది.
అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్‌డ్ అమౌంట్(అస్బా) అమలు చేయడం ద్వారా ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాలోని సొమ్ము ట్రేడింగ్ సభ్యునికి బదిలీకాకుండా నిలిచిపోతుంది. వెరసి లావాదేవీ తదుపరి ఇన్వెస్టర్లకు షేర్లు బదిలీ అయ్యాక మాత్రమే అతని ఖాతా నుంచి నిలిపి ఉంచిన సొమ్ము సంబంధిత ఖాతాకు విడుదల అవుతుంది. ప్రైమరీ మార్కెట్లో ఇప్పటికే అస్బా అమలవుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్(సీసీ)కు అనుగుణంగా క్లయింట్ ఖాతాలోని సొమ్మును నిలిపి ఉంచుతారు. లావాదేవీ గడువు ముగిశాక లేదా సీసీ విడుదల చేశాక నిధులు బదిలీ అవుతాయి. దీంతో అటు సభ్యుల నుంచి సెక్యూరిటీలు, ఇటు క్లయింట్ల నుంచి నిధులు బదిలీ ద్వారా కాకుండా సీసీ ద్వారా లావాదేవీ సెటిల్‌మెంట్ జరుగుతుంది. ఫలితంగా క్లయింట్ల సొమ్ము అక్రమ వినియోగానికి చెక్ పడే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment