స్టాక్స్ వ్యూ
ఎస్‌బీఐ
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.308 ; టార్గెట్ ధర: రూ.375
ఎందుకంటే: అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. వాచ్ లిస్ట్‌లో ఉండే రుణాలు తగ్గుతుండడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, తదితర కారణాల వల్ల రుణ నాణ్యత మెరుగుపడగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీలకు, భారీ ప్రైవేట్ రంగ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల రుణాల విషయంలో బ్యాంక్ సౌకర్యవంతంగా ఉందనే చెప్పవచ్చు.
ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడి వాతావరణం మెరుగుపడితే రుణ నాణ్యత అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరపతి వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగినా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి రికవరీలు పెరుగుతున్నాయి. ఈ పోకడ మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర మొండి బకాయిలు తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్(నిమ్), నిర్వహణ మెరుగుపడుతాయనే అంచనాలతో బ్యాంక్ ఆదాయం(స్టాండోలోన్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం.
మూడేళ్లలో నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవని భావిస్తున్నాం. అనుబంధ బ్యాంక్‌ల విలీనం విషయమై 70వేలకు పైగా ఉద్యోగుల సర్దుబాటు, బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ, విద్యుత్తురంగ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై ఒత్తిడి అధికంగా ఉండడం... అంశాలు కొంచెం సమస్యాత్మకమైనవి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, అత్యుత్తమంగా ప్రయోజనం పొందే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో 66 శాతంగా ఉండడం, మూలధన నిధులు పుష్కలంగా ఉండడం, రిటైల్ డిపాజిట్లు 95 శాతానికి మించి ఉండడం, నిర్వహణ లాభదాయకత పెంపుపై బ్యాంక్ దృష్టి పెట్టడం.. ఇవన్నీ సానుకూలాంశాలు.
జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.175 ; టార్గెట్ ధర: రూ.215
ఎందుకంటే: మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాల, ట్రక్కు, బస్సు టైర్ల(టీబీఆర్) సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఇదొక్కటి. ప్రయాణికుల కార్ల రేడియల్ టైర్ల సెగ్మెంట్లో 12 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చైనా టైర్ల దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. చైనా టైర్ల దిగుమతి లావాదేవీలు అధికంగా నగదులో జరగడమే దీనికి కారణం. మరో వైపు చైనా టైర్లపై అమెరికా ఎలాంటి సుంకాలు విధించకూడదని నిర్ణయించడంతో చైనా కంపెనీలు భారత్‌కు కాకుండా అధిక లాభాలు వచ్చే అమెరికా మార్కెట్‌కు తమ టైర్లను ఎగుమతి చేస్తున్నాయి.
ఈ రెండు రణాల వల్ల చైనా నుంచి పోటీ బాగా తగ్గింది. చైనా నుంచి టైర్ల దిగుమతులు తగ్గడం వల్ల కంపెనీ మార్కెట్ వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. టైర్ల తయారీకి కీలకమైన సహజమైన రబ్బరు ధరలు ఇటీవల కాలంలో తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.94గా ఉన్న కేజీ సహజ రబ్బరు ధర ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.159కు పెరిగినా, ప్రస్తుతానికి రూ.140కి పడిపోయింది. ఈ ధర మరింతగా తగ్గే అవకాశాలున్నాయి.
ఇతర ముడి పదార్ధాల ధరలు (ముడిచమురుతో సంబంధించిన కొన్ని) కూడా తక్కువగానే ఉన్నాయి. నిర్వహణ పనితీరు రక్షణ నిమిత్తం ఈ కంపెనీతో సహా ప్రధాన టైర్ల కంపెనీలు గత ఆర్నెళ్లలో తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకూ పెంచాయి. ఈ ధరల పెంపు కారణంగా కంపెనీ మార్జిన్స్ మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన కావెండిష్ ఇండస్ట్రీస్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న 2 వీలర్, 3 వీలర్ సెగ్మెంట్లలోకి ఈ కంపెనీ ప్రవేశించడమే కాకుండా, టీబీఆర్ సెగ్మెంట్లో కంపెనీ స్థానం మరింతగా పటిష్టం కానుంది.