స్టాక్స్‌ వ్యూ | Stakes View | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Apr 10 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

స్టాక్స్‌ వ్యూ

స్టాక్స్‌ వ్యూ

యస్‌ బ్యాంక్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌  ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రనూ.1,553 ;  టార్గెట్‌  ధర: రూ.2,110

ఎందుకంటే: ఇటీవలే రూ.4,900 కోట్ల నిధులను సమీకరించింది. దీంతో ఈ బ్యాంక్‌కు మూలనిధులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిదాకా కార్పొరేట్‌ రంగంపై  దృష్టి సారించిన ఈ బ్యాంక్‌ రిటైల్, ఎస్‌ఎంఈ సంబంధిత పథకాలను జోరుగా అందుబాటులోకి తెస్తోంది. 2011–16 కాలానికి బ్యాంక్‌ బ్రాంచీలు 32 శాతం, సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లు 90 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2010–11 కాలానికి 11 శాతంగా ఉన్న కాసా నిష్పత్తి గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి 33 శాతానికి పెరిగింది.  కాసా డిపాజిట్లు 2020 కల్లా 40 శాతం సాధించాలని బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. విస్తృతంగా బ్రాంచ్‌ల విస్తరణ,  రిటైల్, కార్పొరేట్‌ రంగాలకు అవసరమైన సేవలందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని ఏడాది ముందుగానే సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక వృద్ధి మందగమనం, ఇతరత్రా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పటికీ, మంచి రుణవృద్ధి సాధిస్తూనే స్థూల మొండి బకాయిలను 1 శాతం లోపే నియంత్రించడం ద్వారా మంచి రుణ నాణ్యతను సాధించింది. 2011–16 కాలానికి రుణ వృద్ధి 23 శాతంగా, నికర లాభం 28 శాతం చొప్పున వృద్ధి చెందాయి. మూడేళ్లలో రుణ వృద్ధి 28 శాతం(బ్యాంకింగ్‌ రంగంలో రుణ వృద్ధికి ఇది దాదాపు రెట్టింపు) చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. కాసా అధికంగా ఉండడం, రిటైల్‌ రుణాలు కూడా అధికంగానే ఉండడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్‌ 20 బేసిస్‌ పాయింట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.  ఫీజు ఆదాయం కూడా ఎక్కువగా ఉండటంతో  నికర లాభం 2020 మార్చి కల్లా 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం.

ర్యాలీస్‌ ఇండియా
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.250  ;   టార్గెట్‌  ధర: రూ.300

ఎందుకంటే: విత్తనాలు, వ్యవసాయ రసాయనాలు సహా వివిధ వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ అందిస్తోంది. వ్యవసాయ రసాయనాల మార్కెట్లో 7 శాతం వాటా ఈ కంపెనీదే.  తన అనుబంధ సంస్థ మెటాహెలిక్స్‌తో కలసి విత్తనాల మార్కెట్లో 3 శాతం వాటా   సాధించింది. వ్యవసాయ ఆదాయం పెంచడం లక్ష్యంగా వివిధ ప్రభుత్వాలు పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఫలితంగా 2017–19 కాలానికి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులనందించే ఈ తరహా కంపెనీల అమ్మకాలు జోరుగా ఉంటాయని భావిస్తున్నాం. 2022 కల్లా వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా తాజా కేంద్ర బడ్జెట్‌ వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమం కోసం కేటాయింపులు 16% పెరిగి రూ.41,855 కోట్లకు పెరిగాయి. వివిధ పథకాలకు భారీ కేటాయింపులు జరిగాయి. రూ.10 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాలు ఇవ్వాలని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇవన్నీ ర్యాలీస్‌ ఇం డియా వంటి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలిగించేవే. ఎలాంటి రుణ భారం లేని ఈ కంపెనీకి ఈ ఏడాది మార్చి చివరి కల్లా రూ.150 కోట్ల నికర నగదు నిల్వలున్నాయి. రెండేళ్లలో ఏడాదికి రూ.200 కోట్ల చొప్పున నగదు నిల్వలు సాధిస్తుందన్న అంచనాలున్నాయి.  రెండేళ్ల కాలానికి ఆర్‌ఓసీఈ(రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌) 22 శాతంగా  ఉంటుందని,  ఇబిటా మార్జిన్లు 150 బేసిస్‌ పాయింట్లు పెరుగుతాయని భావిస్తున్నాం. రెండేళ్లలో అమ్మకాలు 10%, నికర లాభం 17% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేయదగ్గ షేర్‌ ఇదని సూచిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement