ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ ప్యాకేజీలతో వ్యవస్థలో లిక్విడిటీ బాగా పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్, సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొంటున్నారు. నామమాత్ర వడ్డీ రేట్ల కారణంగా చౌన నిధులు స్టాక్ మార్కెట్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొద్ది రోజులుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం..
నాస్‌డాక్ జోరు
గత రెండు వారాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం జోరు చూపుతున్నాయి. ఇందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు సైతం దోహదపడుతున్నాయి. ఈ నెలలోనే ఇటీవల రూ. 15,000 కోట్లవరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12-13 శాతం ఎగశాయి. ఇక గ్లోబల్ మార్కెట్లు సైతం లిక్విడిటీ దన్నుతో పరుగు తీస్తున్నాయి. మార్చి కనిష్టాల నుంచి అమెరికన్ ఇండెక్స్ నాస్‌డాక్ 45 శాతం జంప్ చేసింది. తాజాగా సరికొత్త రికార్డ్ గరిష్టాన్ని చేరుకుంది. ఇదే విధంగా ఎస్‌అండ్‌పీ, డోజోన్స్ ర్యాలీ చేస్తున్నాయి. వీటితో పోలిస్తే దేశీ మార్కెట్లు కొంత వెనకబడ్డాయి.
ఫలితాలవైపు
సమీప కాలంలో మార్కెట్లు కంపెనీల ఫలితాలవైపు దృష్టిసారించవచ్చు. అయితే కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు, నిలిచిపోయిన పారిశ్రామికోత్పత్తి, డిమాండ్ క్షీణత వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలపై అంచనాలు తక్కువే. వీటిని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. నిజానికి 2021 అంచనాలతో పోలిస్తే 21 పీఈలో మార్కెట్లపట్ల అంత భరోసా ఉండకపోవచ్చు. దీంతో ఈ స్థాయిల నుంచి మార్కెట్లు తదుపరి దశ ర్యాలీలోకి ప్రవేశించేముందు కొంతమేర కన్సాలిడేషన్ లేదా.. పతనానికి అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేయడం, ఆర్థిక వ్యవస్థలు తిరిగి పట్టాలెక్కుతుండటం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చే వీలుంది. దీనికితోడు అంతర్జాతీయ స్థాయిలో రెండో దశ ప్యాకేజీలు వెలువడితే.. లిక్విడిటీ మరింత పెరగవచ్చు.
ఎయిర్‌టెల్ భేష్
కోవిడ్-19.. ఫైనాన్షియల్ రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నదీ వేచిచూడవలసి ఉంది. ప్రస్తుత వాతావరణంలో మొబైల్ టెలికం రంగం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రంగంలో భారతీ ఎయిర్‌టెల్ కౌంటర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. క్రమంగా ఏఈర్‌పీయూలు బలపడుతుండటం ఈ కౌంటర్‌కు హుషారునిస్తోంది. ఇప్పటికే రూ. 125 స్థాయి నుంచి ఏఆర్‌పీయూలు రూ. 150కు పుంజుకున్నాయి. అత్యధిక శాతం వినియోగదారులు 2జీ నుంచి 4జీకు మారడం కంపెనీకి కలిసొస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం 4జీ సేవలకు డిమాండ్ పెరుగుతుండటం సానుకూల అంశం. సమీప భవిష్యత్‌లో పెట్టుబడి వ్యయాల అవసరం తగ్గడంతో క్యాష్‌ఫ్లోలు మెరుగుపడే వీలుంది. ఇటీవల రిలయన్స్ జియోపట్ల విదేశీ సంస్థల ఆసక్తిని గమనిస్తే.. దేశీ టెలికం, డిజిటల్ రంగానికున్న అవకాశాలను అంచనా వేయవచ్చు. టెలికంకు సాంకేతికను జోడించడం ద్వారా డిజిటల్ అవకాశాలు పెంచుకోవచ్చు. దీనికితోడు ఇప్పటికే దేశీయంగా టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరిగింది. మూడు ప్రధాన కంపెనీలు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఫలితంగా టెలికం కంపెనీలకు భారీ అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నాం.
ఆటో.. గ్రీన్‌సిగ్నల్
స్టాక్ మార్కెట్ దృష్టితో చూస్తే.. గ్రామీణ ప్రాంత వినియోగానికి ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే రబీ సీజన్ జోరందుకుంది. ఇటీవల వాతావరణ శాఖ వెలువరించిన అంచనాల ప్రకారం నైరుతీ రుతుపవనాలు ఆశలు రేపుతున్నాయి. ఈసారి తగిన సమయానికే రుతుపవనాలు రావడంతోపాటు.. సాధారణ సగటు వర్షపాతానికి చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ప్రభుత్వం సైతం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకు అధిక కేటాయింపులు చేసింది. కనీస మద్దతు ధరలనూ పెంచుతోంది. వలస కూలీలు, శ్రామికుల నుంచి సైతం డిమాండ్ కనిపించే వీలుంది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహన తయారీ కంపెనీలతోపాటు, గ్రామీణ ఫైనాన్సింగ్, ఫెర్టిలైజర్, ఆగ్రో కెమికల్ కంపెనీల బిజినెస్‌లు వృద్ధి చూపే అవకాశముంది. ప్రధానంగా ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను ప్రతిబింబిస్తాయి.
ఎంఅండ్‌ఎం
ఆటో రంగంలో మహీంద్రా(ఎంఅండ్‌ఎం) ఆసక్తికరంగా కనిపిస్తోంది. కంపెనీ నిర్వహణలోని మూడు కీలక బిజినెస్‌లలో రెండు పటిష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధికంగా అమ్మకాలు సాధించడంలో సఫలంకాగలదని అంచనా. కోవిడ్-19 పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీంతో రెండేళ్ల కాలంలో ఆదాయంలో 60 శాతం, నికర లాభాల్లో 80 శాతం వరకూ గ్రామీణ ప్రాంతాల నుంచి సమకూర్చుకోగలదని అంచనా వేస్తున్నాం. ఇక ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటో, బజాజ్ ఆటోను ప్రస్తావించవచ్చు. ఎగుమతులు, త్రిచక్ర వాహన మార్కెట్ కారణంగా బజాజ్ ఆటోతో పోలిస్తే.. హీరోమోటోకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment