ముంబై: డిస్కౌంట్ బ్రోకరేజీలను మించి పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలు ఇటీవల రిటైల్ డెరివేటివ్ విభాగంలో జోరు చూపుతున్నాయి. ఫ్యూచర్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో ఏంజెల్‌వన్, మోతీలాల్ ఓస్వాల్ డిస్కౌంట్ బ్రోకరేజీలను మించుతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. రిటైల్ విభాగంలో ఏంజెల్‌వన్ 82 శాతం, మోతీలాల్ ఓస్వాల్ 54 శాతం ఆదాయ వాటాను పొందినట్లు ఒక నివేదిక పేర్కొంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేపట్టిన ఒక పరిశీలన ప్రకారం డిస్కౌంట్ బ్రోకర్స్ ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా జరిగే ఎఫ్‌అండ్‌వో లావాదేవీల జోరుకు కారణమవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో పరిమాణంలో 2022లోనూ ఎన్‌ఎస్‌ఈ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్సే్ఛంజీగా నిలిచిన సంగతి తెలిసిందే.
రిటైలర్లకు నష్టాలు
గత కేలండర్ ఏడాది(2022)లో రిటైల్ ట్రేడర్లు నిర్వహించిన 10 ఎఫ్‌అండ్‌వో ట్రేడ్‌లలో 9 నష్టాలతోనే ముగిసినట్లు గత నెలలో సెబీ పేర్కొంది. సుమారు రూ. 1.1 లక్షల కోట్ల నష్టాలు నమోదైనట్లు తెలియజేసింది. అంతేకాకుండా 2019తో పోలిస్తే డెరివేటివ్ విభాగంలో రిటైల్ ట్రేడర్ల సంఖ్య 500 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వెరసి ఇన్వెస్టర్ల కోసం బ్రోకర్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలు రూపొందించే అదనపు రిస్క్ మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలియజేసింది. టెక్నాలజీపై దృష్టిపెట్టిన ఏంజెల్‌వన్ అతితక్కువ కాలంలోనే 12.89 మిలియన్ కస్టమర్లను పొందడం ద్వారా 2023 జనవరికల్లా అతిపెద్ద బ్రోకరేజీగా ఆవిర్భవించింది. 2022 అక్టోబర్–డిసెంబర్(క్యూ3) కాలంలో సాధించిన రూ. 800 కోట్ల ఆదాయంలో 82 శాతం వాటాను ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారానే పొందింది. ఈ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం వరుసగా గత రెండు సంవత్సరాలలో ఎఫ్‌అండ్‌వో వాటా 72 శాతం, 52 శాతంగా నమోదైంది.
ఇక ఈ క్యూ3లో మోతీలాల్ ఆర్జించిన రూ. 688 కోట్ల ఆదాయంలో 54 శాతం వాటా ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచే లభించింది. 2019లో 39 శాతంగా నమోదైన ఈ వాటా తదుపరి ఇదేస్థాయిలో కొనసాగుతూ తాజాగా 54 శాతానికి ఎగసింది. మరోవైపు బ్రోకింగ్ రంగంలో రెండో ర్యాంకులో ఉన్న జిరోధా డెరివేటివ్ విభాగం నుంచి 20 శాతమే పొందింది. ఈ సంస్థ 7 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో డిస్కౌంట్ బ్రోకింగ్‌లో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి 75 శాతం పరిమాణాన్ని సాధిస్తోంది. అప్‌స్టాక్స్, 5పైసా, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తదితరాలు సైతం డిస్కౌంట్ బ్రోకింగ్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. కాగా.. పూర్తిస్థాయి బ్రోకింగ్ సేవలందించే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్‌అండ్‌వో నుంచి 20 శాతం ఆదాయాన్ని అందుకుంది. ఈ బాటలో 8.7 మిలియన్ కస్టమర్లను కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్‌నుంచి 20 శాతం ఆదాయాన్నే పొందింది.
డెరివేటివ్స్‌లో రిటైలర్లు
సెబీ పరిశీలన ప్రకారం గతేడాది(2022)లో టాప్–10 బ్రోకర్ల ద్వారా 45 లక్షలకుపైగా రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించారు. 2019లో నమోదైన 7.1 లక్షమందితో పోలిస్తే ఈ సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. ఇటీవల కొత్త ఇన్వెస్టర్లు, యువత అత్యధికంగా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ చేపడుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో 36 శాతం 20–30 మధ్య వయసువారు కావడం గమనార్హం! 2019లో వీరి సంఖ్య 11 శాతమే.
Comments
Please login to add a commentAdd a comment