స్టాక్స్ వ్యూ టీటీకే ప్రెస్టీజ్ | View stocks Prestige ttk | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ టీటీకే ప్రెస్టీజ్

Published Mon, Jan 25 2016 12:31 AM | Last Updated on Wed, Sep 19 2018 8:41 PM

View stocks Prestige ttk

బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.4,176   టార్గెట్ ధర: రూ.5,150
ఎందుకంటే: గృహోపకరణాలు, కుక్‌వేర్ కేటగిరీల్లో అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటి. ప్రెజర్ కుక్కర్‌ల కేటగిరీలో 37 శాతం, కుక్‌వేర్ కేటగిరీలో 31 శాతం, గృహోపకరణాల కేటగిరీలో 10 శాతం చొప్పున మార్కెట్ వాటాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత క్యూ3లో రూ.380 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 17 శాతం వృద్ధితో రూ.450 కోట్లకు పెరిగాయి.

ఇబిటా మార్జిన్ 110 బేసిస్ పాయింట్ల వృద్ధితో 13 శాతానికి ఎగసింది. నికర లాభం రూ.28 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.37 కోట్లకు పెరిగింది.  ఈ కామర్స్ వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు జోరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో ఈ కామర్స్ విభాగం వాటా 5 శాతంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఒక కుక్‌వేర్ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికాలంలో విభిన్న మోడళ్లలో వాటర్ ప్యూరిఫయర్లను అందించనున్నది. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా కొత్త మోడళ్లలో పాత్రలను, కుక్కర్‌లను, ఇండక్షన్ కుక్‌టాప్‌లను అందుబాటులోకి తేనున్నది.

కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనుండడం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మంచి పనితీరు కనబరచడం, ముడి పదార్థాల ధరలు తగ్గుతుండడం, సొంతంగా వస్తువులను ఉత్పత్తి చేయడం పెరుగుతుండడం వల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుండడం,  ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటంతో దేశీయంగా డిమాండ్ పుంజుకుంటుండడం...ఇవన్నీ కంపెనీకి కలసి వచ్చే అంశాలు.

గత ఐదేళ్లలో కంపెనీ స్థిరాస్తులు 8 రెట్లు పెరిగాయి. ఆస్తుల వినియోగం అత్యుత్తమంగా ఉండడం వల్ల రీ ఇన్వెస్ట్‌మెంట్ అవసరాలు స్వల్పంగా ఉండడంతో నగదు ప్రవాహాలు పుష్కలంగా వస్తాయిని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 14 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.

 ఆల్ట్రాటెక్ సిమెంట్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.2,719   టార్గెట్ ధర: రూ.3,600
ఎందుకంటే: దేశంలోనే అత్యధిక  ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సిమెంట్ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా సిమెంట్ రంగంలో 18 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. గత ఐదేళ్లలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది.  ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 72.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కంపెనీ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.5,747 కోట్లకు పెరిగింది. విద్యుత్తు, ఇంధన వ్యయాలు తగ్గడంతో ఇబిటా టన్నుకు 15 శాతం వృద్ధితో రూ.900కు ఎగసింది. ఇంధన వ్యయాలు మరింతగా తగ్గుతాయని అంచనా. ఈ వ్యయాల క్షీణత పూర్తి ఫలాలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో కనిపిస్తాయి.  మౌలిక రంగాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించడం, హౌసింగ్ డిమాండ్ క్రమక్రమంగా పుంజుకోవడం, ఏడవ వేతన కమిషన్ సిఫారసులు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణమవుతుండడం..ఈ అంశాలన్నీ సిమెంట్‌కు డిమాండ్ పెరగడానికి తోడ్పడతాయని అంచనా వేస్తున్నాం.

డిమాండ్ పుంజుకుంటే అతి పెద్ద సిమెంట్ కంపెనీగా ఈ కంపెనీకి ప్రయోజనం కలుగుతుంది. దేశవ్యాప్తంగా విస్తరించడం, సొంత పవర్ ప్లాంట్లు ఉండడం, కంపెనీ వినియోగించే విద్యుత్తు 80% సొంత ప్లాంట్ల నుంచే కావడం, పెట్ కోక్ వినియోగం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుండడం, మరిన్ని గ్రైండింగ్ యూనిట్లను ప్రారంభించడం ద్వారా రవాణా వ్యయాలు తగ్గనుండడం కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నాయి. రెండేళ్లలో సిమెంట్‌కు డిమాండ్ 9% చొప్పున, కంపెనీ అమ్మకాలు 8% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా.

 దివాన్ హౌసింగ్ ఫైనాన్స్
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.187  టార్గెట్ ధర: రూ.250
ఎందుకంటే: 1984లో కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 550కు పైగా కార్యాలయాలతో, 2 అంతర్జాతీయ కార్యాలయాలతో సేవలందిస్తోంది. ఈ కంపెనీ 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలం (అక్టోబర్- డిసెంబర్) ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.   నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.190 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగింది. రుణ మంజూరీ 31 శాతం ఎగసింది.  అయితే రుణ నాణ్యత స్వల్పంగా క్షీణించింది.

 2015-16 ఆర్థిక సంవత్సరం క్యూ2లో 0.81 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 0.84 శాతానికి పెరిగాయి.  దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తన పెట్టుబడులను 53 శాతం బ్యాంకుల నుంచే సమీకరిస్తోంది. అందువలన బ్యాంక్‌లు బేస్ రేట్ (కనీస రుణరేటు) తగ్గించడం ఈ కంపెనీకి కలసి వచ్చే అంశం. మూడో త్రైమాసిక కాలం (అక్టోబర్- డిసెంబర్) కాలంలో  ఎస్‌ఎంఈ సెగ్మెంట్ రుణాలు పెరిగాయి. ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన వారంట్ల జారీ ద్వారా రూ.500 కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అందరికీ ఇళ్లు’(హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్ వల్ల దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రయోజనం కలగనున్నది.

 గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.159గా ఉన్న కంపెనీ పుస్తక విలువ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.232కు పెరుగుతుందని భావిస్తున్నాం, నికర మొండి బకాయిలు 0.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నిర్వహణ ఆస్తులు 22 శాతం చొప్పున, ఆదాయం 18 శాతం చొప్పున  చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  రిస్క్ అధికంగా ఉండే ప్రాజెక్ట్ లోన్‌లు మొత్తం లోన్‌బుక్‌లో పెరుగుతుండడం.. ప్రతికూలాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement