చెట్టినాడ్ చేతికి అంజనీ సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్‌ను తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ సిమెంట్ కొనుగోలు చేసింది. ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లకు చెందిన 61.62% వాటాను చెట్టినాడ్‌కు విక్రయించడానికి మంగళవారం సమావేశమైన అంజనీ సిమెంట్స్ బోర్డు ఆమోదం తెలిపింది. మిగిలిన వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓపెన్ ఆఫర్ ధర రూ.61.75 కాగా, రూ. 10 ముఖ విలువగల 47.89 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ బీఎస్‌ఈకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇందుకోసం రూ.29.52 కోట్లు కేటాయించింది. కె.వి.విష్ణురాజుకు చెందిన అంజనీ పోర్ట్‌లాండ్ సిమెం ట్ గత 9 నెలల్లో రూ.202 కోట్ల ఆదాయంపై రూ.5.24 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కంపెనీకి రూ.222 కోట్ల రుణ భారం ఉన్నట్లు తెలుస్తోంది. 1983లో స్థాపించిన అంజనీ పోర్ట్‌లాండ్ సిమెంట్‌కి నల్లగొండ జిల్లాలో 1.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల్గిన యూనిట్ ఉంది. ఈ వార్తల నేపథ్యంలో అంజనీ పోర్ట్‌ల్యాండ్ షేరు 4% తగ్గి రూ.55.45 వద్ద ముగిసింది.